కార్మికుల హక్కులను కాలరాస్తే కఠిన చర్యలు
కార్మికుల హక్కులను కాలరాస్తూ,వారిని వేధింపులకు గురిచేసే సంస్థలు లేదా అవుట్సోర్సింగ్ ఏజెన్సీలపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు హెచ్చరించారు.శుక్రవారం జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) కార్యాలయంలో కార్మిక, ఉపాధి, కర్మాగారాలు,శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రపంచ కార్మిక దినోత్సవం’ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేడ్కర్ కార్మికుల సంక్షేమం కోసం 8 గంటల పని దినాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారని,ఆ ఆశయాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.ముఖ్యంగా మెగా ఏజెన్సీలో 140 మంది చేయాల్సిన పనులను కేవలం 70 మందితో చేయిస్తూ కార్మికులను శ్రమదోపిడీకి గురిచేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని,దీనిపై తక్షణమే విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.కార్మికులపై పనిభారం మోపుతూ వారిని ఇబ్బందులకు గురిచేసే ఏజెన్సీలను బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆయన సూచించారు.జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. ఎందరో కార్మికుల ప్రాణత్యాగాల ఫలితంగానే నేడు కార్మిక హక్కులు సాధ్యమయ్యాయని, సమాజ అభివృద్ధిలో శ్రమజీవుల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. “డిగ్నిటీ ఆఫ్ లేబర్” అనేది ప్రతి కార్మికుడి హక్కు అని, సింగరేణి, జెన్కో వంటి సంస్థల్లో వేలాది మంది కార్మికులు ప్రజాసేవలో నిమగ్నమై ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. కార్మికులకు ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావచ్చని, ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఏటీసీలో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. విధుల్లో విశిష్ట సేవలు అందించిన సింగరేణి ఏజీఎం ఎర్రన్న, ఏటీఓ అభినవ్లకు ‘ఉత్తమ ఉద్యోగి’ పురస్కారాలు, లక్ష్మి నరసింహ ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని వినయ్ కుమార్‌కు ‘ఉత్తమ మేనేజ్మెంట్’ ప్రశంసా పత్రాన్ని అందజేసి శాలువాతో సత్కరించారు. పదో తరగతిలో ప్రతిభ చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను కూడా ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణ, కార్మిక శాఖ అధికారి వినోద, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, ఐటీఐ ప్రిన్సిపాల్ జుమ్లా నాయక్, సింగరేణి ఏజీఎం ఎర్రన్నతో పాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు వెంకటేశ్వర్లు, మధుకర్ రెడ్డి, సతీష్, కోలా శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.