జంట గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు–ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ


ఈ69న్యూస్ హన్మకొండ మే18
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ముప్పారం, నారాయణగిరి గ్రామాల్లో శనివారం అభివృద్ధి కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొని పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా రెండో విడతలో భాగంగా మొత్తం 114 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ముప్పారం గ్రామంలో 64 మంది, నారాయణగిరిలో 40 మంది, సోమదేవరపల్లిలో 4 మంది లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. అదనంగా కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు, రూ.45 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు.
ముప్పారం గ్రామంలో గౌడ, కురుమ కమ్యూనిటీ హాల్లు, నారాయణగిరిలో ముదిరాజ్ మరియు మహిళా కమ్యూనిటీ హాల్లకు మంజూరు పత్రాలు అందజేశారు. గ్రామాల అభివృద్ధికి కోట్ల రూపాయలు కేటాయించినట్లు ప్రజాప్రతినిధులు తెలిపారు.
ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇళ్ల మంజూరు జరుగుతోందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ గ్రామాల వారీగా సర్వే నిర్వహించి అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్లు అందజేస్తామని, ఎలాంటి మధ్యవర్తులు అవసరం లేదని స్పష్టం చేశారు.
అలాగే నారాయణగిరి జడ్పిహెచ్ఎస్ పాఠశాలను తెలంగాణ మోడల్ స్కూల్‌గా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.