జమాలపురంలో పంచాయతీ&వీఓ భవనాలకు శంకుస్థాపన
•రూ. 30 లక్షలతో నిర్మాణం- ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
•ప్రజా సంక్షేమే కాంగ్రెస్ ధ్యేయం- 2030 నాటికి కోటి మహిళలు కోటీశ్వరులు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం జమాలపురం గ్రామంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. గ్రామంలో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనంతో పాటు, విలేజ్ ఆర్గనైజేషన్ వీఓ భవన నిర్మాణ పనులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సోమవారం ఘనంగా శంకుస్థాపన చేశారు.స్థానిక సర్పంచ్ జున్ను కనకయ్యతో కలిసి ఆయన భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు.ఈ రెండు భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.30 లక్షల నిధులు మంజూరు చేసింది.
ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ,రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నిరుపేదల సంక్షేమే ధ్యేయంగా పాలన సాగిస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం క్రమంగా నెరవేరుస్తోందని స్పష్టం చేశారు.ఇందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, అర్హులైన ఇళ్లకు ఉచిత విద్యుత్ సరఫరా ఇస్తున్నామని గుర్తుచేశారు.నిరుపేదల సొంతింటి కల నిజం చేయడానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం పెట్టామని,జమాలపురం గ్రామంలో పైలెట్ ప్రాజెక్టు కింద 25 ఇళ్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులతో పాటు,కొత్త పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. పేదలకు నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే మహిళా సంఘాలకు సున్నా వడ్డీకే అప్పులు ఇస్తున్నామని ప్రకటించారు. మహిళలు సంఘాల కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి వీలుగా ప్రత్యేకంగా వీఓ భవనం మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా నిధుల కొరత లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయ్యూబ్,ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు,మండల అధికారి వెంకటస్వామి,ఎంపీడీవో శంకర్ నాయక్, ఎంపీఓ శేషాంజన్ స్వామి, ఎస్సై ప్రవీణ్,గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిత పాల్గొన్నారు. వీరితో పాటు సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మట్టపెల్లి వెంకటేశ్వర్ రావు, వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.