జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
అమరవీరుల త్యాగస్ఫూర్తితో జిల్లాను అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుదాం:కలెక్టర్ పిలుపు
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి
జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి,జిల్లా ప్రజలకు, ఉద్యోగులకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, సుదీర్ఘ పోరాటాలు, ఎందరో అమరవీరుల త్యాగాల ఫలమే నేటి ప్రత్యేక రాష్ట్ర సాకారం అని కొనియాడారు.వారి త్యాగస్ఫూర్తిని నిరంతరం స్మరించుకుంటూ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాను రాష్ట్రంలోనే అభివృద్ధి పథంలో ఆదర్శంగా నిలపడానికి ప్రజాప్రతినిధులు,అధికారులు సంయుక్తంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.జిల్లా సమగ్ర అభివృద్ధి సాధించడమే ధ్యేయంగా పరిపాలనా యంత్రాంగం సరికొత్త దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని, ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.ఈ వేడుకల్లో జిల్లా ప్రజా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ (ఇంచార్జ్) శ్రీమతి విజయలక్ష్మి ప్రత్యేకంగా పాల్గొని మాట్లాడారు.జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ఆమె వివరించారు.ఈ ఘనమైన కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా పరిషత్ కార్యాలయ పర్యవేక్షకులు, సిబ్బంది,స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.