మడిపడిగ చంద్రశేఖర్, బిఎస్పీ జిల్లా అధ్యక్షులు
అమరవీరుల ఆశయాల సాధనకు బహుజన తెలంగాణ నిర్మాణమే లక్ష్యం
– మడిపడిగ చంద్రశేఖర్, బిఎస్పీ జిల్లా అధ్యక్షులు
తెలుగు గళం న్యూస్ జనగామ జూన్ 02
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడంతో పాటు తెలంగాణ అమరవీరులను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు నీర్మాల రత్నం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక ఉన్న చారిత్రక సత్యాలను ప్రజలు గుర్తుంచుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జాతీయ స్థాయిలో మొదటిసారిగా స్పష్టమైన, బేషరతు మద్దతు ప్రకటించిన పార్టీ బహుజన సమాజ్ పార్టీ మాత్రమేనని తెలియచేసారు.బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదించిన చిన్న రాష్ట్రాల సిద్ధాంతాన్ని అమలు చేయాలనే దృఢ సంకల్పంతో బీఎస్పీ అధినేత్రి బహన్ కుమారి మాయావతి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటించారని తెలిపారు.అనంతరం జిల్లా అధ్యక్షులు మడిపడిగ చంద్రశేఖర్ మాట్లాడుతూ 2014లో తెలంగాణ రాష్ట్ర బిల్లు పార్లమెంట్లో వచ్చిన సమయంలో టీఆర్ఎస్కు కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉండగా, బీఎస్పీకి చెందిన 39 మంది ఎంపీలు బేషరతుగా మద్దతు ఇవ్వడం వల్లే తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందని,తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఎస్పీ పోషించిన పాత్రను చరిత్ర ఎప్పటికీ మరచిపోదని అన్నారు.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగం కారణంగానే తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం సాకారమైందని తెలిపారు.తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, బహుజన వర్గాల ప్రజలు ప్రాణత్యాగాలు చేశారని, కానీ నేటి ప్రభుత్వాలు అమరవీరుల త్యాగాలను, వారి కుటుంబాల సమస్యలను పూర్తిస్థాయిలో గుర్తించడం లేదని విమర్శించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, రాజకీయ భాగస్వామ్యం ఇంకా పూర్తిస్థాయిలో అమలు కాలేదని, అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా బహుజనుల పాలన స్థాపించడమే బీఎస్పీ లక్ష్యమని స్పష్టం చేశారు.తెలంగాణ సాధనలో బీఎస్పీ పాత్రను చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని, అమరవీరుల త్యాగాలకు నిజమైన నివాళి బహుజన తెలంగాణ నిర్మాణమేనని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మబ్బు ఉదయ్, జిల్లా కార్యదర్శి చిలుముల అర్జున్,జిల్లా మహిళా కన్వీనర్ తాండ్ర లావణ్య,నాయకులు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.