ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో సత్తుపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సంఘం డివిజన్ కార్యదర్శి రావుల రాజబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పంట కోతలు ప్రారంభమైనప్పటికీ రైతులకు తమ ధాన్యాన్ని విక్రయించేందుకు సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరలకు ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి గ్రామంలో లేదా సమీప ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధరను కచ్చితంగా అమలు చేయాలని, కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని కోరారు.
రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మోరంపూడి పాండురంగారావు, కొలికపోగు సర్వేశ్వరరావు, మోరంపూడి వెంకట్రావు, పాకలపాటి ఝాన్సీ, వెంకటేశ్వరావు, రమేష్, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.