మాజీ మంత్రి ఎర్రబెల్లి, ఆరూరి గృహ నిర్భంధం
ఆర్టీసీ డ్రైవర్ మృతి ప్రభుత్వ హత్యనే: పరామర్శకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులపై ఎర్రబెల్లి ఫైర్
హనుమకొండ జిల్లా:ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి ప్రభుత్వ హత్యనే అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. మృతుడికి నివాళులర్పించేందుకు వెళ్తున్న తనను, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ను పోలీసులు గృహ నిర్భంధం చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.హన్మకొండ రాంనగర్‌లోని తన నివాసం నుండి శంకర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరుతుండగా ముందస్తు అరెస్టులో భాగంగా ఏసీపీ నరహరిరావు, సీఐలు రంజిత్, రవికుమార్, సుధాకర్ రెడ్డి, ఎస్ఐ మహేందర్ రెడ్డి ఇంటికి వచ్చి అడ్డుకున్నారని ఎర్రబెల్లి తెలిపారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ “ఆర్టీసీ కార్మికులను నమ్మించి కాంగ్రెస్ సర్కార్ దగా చేసింది. శంకర్ గౌడ్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి” అని డిమాండ్ చేశారు.“నర్సంపేటలో నిప్పంటించుకొని శంకర్ గౌడ్ మృతి చెందాడు. మరో ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇవి ముమ్మాటికీ రేవంత్ సర్కార్ హత్యలే. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇంకెంత కాలం గడుపుతారు? ఇంకెంత మందిని బలి తీసుకుంటారు రేవంత్ రెడ్డి?” అని ప్రశ్నించారు.అధికార పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుందని తెలిపారు. ప్రజలే తరిమి కొట్టేదాకా చూసుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ సందర్భంగా వర్ధన్నపేట బీఆర్ఎస్ నాయకులు మాజీ కార్పొరేటర్ చింతల యాదగిరి, మాజీ జడ్పీటీసీ మార్గం బిక్షపతి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ పట్టపురం యాకాంతం గౌడ్, పర్వతగిరి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు, జాక్‌కు రమేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.