రాజ్యాధికార సమరభేరి సభ విజయవంతం:రవి పటేల్
జూలై 5న భువనగిరిలో నిర్వహించిన ‘రాజ్యాధికార సమరభేరి’ బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూపాలపల్లి జిల్లా నుంచి భారీ సంఖ్యలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి సభను జయప్రదం చేయడం అభినందనీయమన్నారు.ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఇలాంటి భారీ బహిరంగ సభలను నిర్వహిస్తామని వెల్లడించారు.పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేస్తూ పార్టీని గ్రామ గ్రామాన విస్తరించాలని పిలుపునిచ్చారు. బహుజన వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పార్టీలో చేరి, వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న చేపడుతున్న ఉద్యమానికి మద్దతుగా నిలవాలని కోరారు. తెలంగాణలో 2028 నాటికి రాజ్యాధికారమే లక్ష్యంగా తీన్మార్ మల్లన్న ప్రారంభించిన ‘సర్జికల్ స్ట్రైక్’, ‘కౌంట్‌డౌన్’ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు గడిచినా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, స్వరాష్ట్రంలో గానీ ఒక్క బీసీ నాయకుడు కూడా ముఖ్యమంత్రి కాలేకపోవడం విచారకరమన్నారు. అందుకే బహుజనులందరూ ఐక్యంగా ముందుకు సాగి,రాజ్యాధికారం సాధించే దిశగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు.ఈ విలేకరుల సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సామల శ్రీలత, క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు గండు కరుణాకర్,జిల్లా కోఆర్డినేటర్ మామిడి శ్రీకాంత్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అన్నం రామ్ చరణ్, నాయకులు వామినోజు రాజేందర్, సామల చంద్రశేఖర్, బుర్రి కుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు.