14 గంటల చర్చలతో ఫలించిన ఆర్టీసీ సమ్మె
బెదిరింపులను ఎదురించి సాధించిన విజయం: ఆర్టీసీ కార్మికుల పోరాటం చరిత్రలో మైలురాయి వరంగల్ జిల్లా:న్యాయమైన డిమాండ్ల సాధనకై జేఏసీ నాయకత్వంలో ఐక్యంగా పోరాడి విజయం సాధించిన ఆర్టీసీ కార్మిక సోదరీ సోదరులకు భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు అభినందనలు తెలిపారు.ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆర్టీసీ జేఏసీ నాయకులతో 14 గంటల పాటు సుదీర్ఘ చర్చల అనంతరం ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికల నిర్వహణ, 11% పీఆర్సీ ఇచ్చేందుకు మిగతా డిమాండ్లన్నింటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సమ్మె విరమించడం ఇటు కార్మికులకు అటు ప్రజానీకానికి ఎంతో ఊరట లభించిందన్నారు.
యాజమాన్యం, ప్రభుత్వం ఎన్ని బెదిరింపులు చేసినా,అక్రమంగా అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురిచేసినా మండుటెండలను సైతం లెక్కచేయక వివిధ రూపాలలో ఆందోళనలు,పోరాటాలు నిర్వహించి విజయం సాధించిన ఈ సమ్మె ఆర్టీసీ కార్మిక పోరాట చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందన్నారు.
సమ్మె నోటీసు ఇచ్చిన వెంటనే చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి ఉంటే సమ్మె చేసే పరిస్థితి వచ్చేది కాదని, సమ్మె వలన ఆర్టీసీ కార్మికులు, లక్షలాదిమంది ప్రయాణికులు పడిన బాధలు వర్ణనాతీతమన్నారు.
ప్రభుత్వ మొండి వైఖరితో మనస్తాపం చెంది డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మాహుతి చేసుకోవడం, మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడటం జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రాణత్యాగం చేసిన శంకర్ గౌడ్‌కే ఈ విజయం అంకితమవుతుందన్నారు.
ఆలస్యంగానైనా డిమాండ్లు అంగీకరించి సమ్మెను పరిష్కరించిన ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు, సమ్మెను బలపరిచి మద్దతు ప్రకటించిన రాజకీయ పార్టీలకు,వివిధ కార్మిక సంఘాలకు, ప్రజాస్వామ్య శక్తులకు వెంకట్రాములు ఉద్యమాభినందనలు తెలియజేశారు.