శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లుశ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

రేగొండ మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు (జాతర) మరియు పునఃప్రతిష్ఠాపన మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే శ్రీ గండ్ర సత్యనారాయణ రావు ఆదేశించారు.గురువారం ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ పరిసరాలను వివిధ శాఖల అధికారులు, గుత్తేదారులతో కలిసి పరిశీలించి ఏర్పాట్లపై సమీక్షించారు. ఉత్సవాల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.భక్తులకు తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య నిర్వహణ, నిరంతర విద్యుత్ సరఫరా, అత్యవసర వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలను సమగ్రంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక శుభ్రత చర్యలు చేపట్టి, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు నీడ కల్పించే చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.భక్తుల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులు నడపాలని, పోలీస్ శాఖతో సమన్వయం చేసి భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టాలని తెలిపారు. ఉత్సవాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను హెచ్చరించారు.అలాగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించేలా సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.ఆలయ కమిటీ సభ్యులు,ప్రజాప్రతినిధులు,అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు భక్తి, శాంతి, సాంప్రదాయ విలువలకు ప్రతీకగా నిలుస్తాయని, ఈ ఉత్సవాలు ప్రాంతీయ ఐక్యతను బలోపేతం చేస్తాయని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *