హనుమకొండలో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక దాడులు

ప్రముఖ హోటళ్ల కిచెన్లలో బొద్దింకలు, ఈగలు.. కుళ్లిన ఆహార పదార్థాలు
అనుమానాస్పద ఆహారం, నీటి నమూనాలు సేకరణ.. షోకాజ్ నోటీసులు
హనుమకొండ, సెప్టెంబర్ 11 (ఈ69 న్యూస్):
ఆహార ప్రియుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు. హనుమకొండ నగరవ్యాప్తంగా గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక తనిఖీల్లో భాగంగా శుక్రవారం పలు ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నగరంలోని బాలసముద్రం ప్రాంతంలోని వెయ్యి స్తంభాల హోటల్, నక్కలగుట్టలోని పాపడమ్స్ బ్లూ, గ్రీన్ బావర్చి తదితర హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు.
కిచెన్లలో బొద్దింకలు.. ఈగల స్వైరవిహారం
తనిఖీల సందర్భంగా కొన్ని హోటళ్ల వంటగదుల్లో అపరిశుభ్ర వాతావరణం అధికారులను విస్తుపోయేలా చేసింది. కిచెన్లలో బొద్దింకలు, ఈగలు సంచరిస్తుండటంతో పాటు దుర్వాసన వస్తున్నట్లు గుర్తించారు. వంటగదుల నిర్వహణలో కనీస పరిశుభ్రతా ప్రమాణాలు పాటించకపోవడంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ హోటల్లో పన్నీర్ కర్రీలో పురుగులు కనిపించినట్లు అధికారులు గుర్తించారు.
కుళ్లిన ఆహారం.. నాణ్యత లేని నీటి బాటిళ్లు
తనిఖీల్లో నాణ్యతపై అనుమానాలున్న ఆర్వో నీటి బాటిళ్లతో పాటు కుళ్లిపోయిన ఆహార పదార్థాలు, సరిగా నిల్వ చేయని తినుబండారాలను గుర్తించి సీజ్ చేశారు. అనుమానాస్పదంగా ఉన్న పలు ఆహార పదార్థాలు, నీటి నమూనాలను అధికారులు సేకరించారు. వాటిని పరీక్షల నిమిత్తం రాష్ట్ర ఆహార పరీక్షల ప్రయోగశాలకు పంపించినట్లు తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు
హనుమకొండ–వరంగల్ నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లకు వినియోగదారుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో యాజమాన్యాలు బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్ల యాజమాన్యాలకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
ప్రయోగశాల పరీక్షల నివేదికలు అందిన అనంతరం నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత హోటళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అవసరమైతే లైసెన్సులు రద్దు చేసే చర్యలు కూడా చేపడతామని స్పష్టం చేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహారం తీసుకునే సమయంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఆహారం నాణ్యతపై అనుమానం కలిగితే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. నగరంలోని మరిన్ని హోటళ్లు, రెస్టారెంట్లలోనూ తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.