
వరంగల్ సెప్టెంబర్ 21(ఈ69న్యూస్)
వరంగల్లోని దయానంద కాలనీ లో శివపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వినాయకుడిని లక్ష్మీ గణపతి అవతారంలో ప్రత్యేకంగా అలంకరించారు.డాలర్లు, భారతీయ కరెన్సీ నోట్లతో గణపతిని అలంకరించడం ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.మండలి నిర్వాహకులు గత మూడు సంవత్సరాలుగా భారీ విగ్రహాలను ఏర్పాటు చేసి వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే సిద్ధాల కుటుంబానికి చెందిన పూర్వీకులు సుమారు 30 సంవత్సరాలుగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తూ వస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ సంప్రదాయాన్ని భవిష్యత్ తరాల్లోనూ కొనసాగిస్తామని పేర్కొన్నారు.ఈ ఏడాది వేడుకల్లో భాగంగా 108 రకాల ప్రసాదాలను ప్రత్యేకంగా తయారు చేసి గణపతికి సమర్పించారు. కుటుంబానికి చెందిన సుమారు 10 కుటుంబాలు కలిసి వివిధ రకాల ప్రసాదాలను తయారు చేసి తీసుకువచ్చారు.ప్రతి సంవత్సరం కుటుంబ సభ్యులు తమ పనుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వినాయక చవితి సందర్భంగా అందరూ ఒకచోట చేరి ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు.అలాగే రేపు ప్రత్యేకంగా హోమం, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. సుమారు వెయ్యి మందికి అన్నదానం చేయనున్నట్లు తెలిపారు.వరంగల్ నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ప్రత్యేక వేడుకలను విజయవంతం చేయాలని శివపుత్ర గణేష్ మండలి నిర్వాహకులు కోరారు.