పాలకుర్తిలో సిపిఎం, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల భద్రతపై సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల ముందు ధర్నా

ఈ69 న్యూస్ జనగామ/పాలకుర్తి, సెప్టెంబర్ 25

విద్యార్థుల భద్రత విషయంలో గురుకుల పాఠశాల యాజమాన్యం, సంబంధిత అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ, సీపీఎం ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల ప్రధాన గేటు ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పాలకుర్తి మండల తహసీల్దార్‌కు అందజేశారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జనగామ జిల్లా అధ్యక్షుడు పొదల లవకుమార్, సీపీఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న మాట్లాడుతూ విద్యార్థుల భద్రత విషయంలో గురుకుల పాఠశాల యాజమాన్యం, సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల జీవితాలు అయోమయంలో పడుతున్నాయని ఆరోపించారు. విద్యార్థులకు కనీస భద్రత కూడా కల్పించకపోవడం సిగ్గుచేటని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెబుతూ పెద్దపెద్ద వాగ్దానాలు చేస్తున్నప్పటికీ, పాలకుర్తి నియోజకవర్గంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి క్యాంపు కార్యాలయానికి ఆనుకుని ఉన్న గురుకుల పాఠశాలలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం ఆందోళనకరమని వారు పేర్కొన్నారు. ఇక్కడి పరిస్థితులను బట్టి రాష్ట్రవ్యాప్తంగా గురుకుల విద్యార్థుల భద్రత, వసతుల పరిస్థితిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.ఘటనపై జిల్లా కలెక్టర్, గురుకులాల కార్యదర్శి వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని, నిర్లక్ష్యానికి బాధ్యులైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.విద్యార్థులకు తగిన భద్రత కల్పించడంలో విఫలమైన యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.తమ డిమాండ్లపై అధికారులు స్పందించకపోతే ఎస్ఎఫ్ఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు ఎదునూరి మదర్, ముసుకు ఇంద్రారెడ్డి, ఎస్ఎఫ్ఐ జనగామ జిల్లా బాలికల విభాగం కన్వీనర్ కడారి మానస, మండల అధ్యక్ష, కార్యదర్శులు ప్రశాంత్, శ్రీకాంత్, నాయకులు అరవింద్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *