* ఏజెన్సీ ఉద్యోగాలపై స్థానిక హక్కులు కాపాడాలి: తుడుందెబ్బ డిమాండ్* ఏజెన్సీ ఉద్యోగాలపై స్థానిక హక్కులు కాపాడాలి: తుడుందెబ్బ డిమాండ్
  • ఐటీడీఏ పీఓకు వినతి పత్రం అందజేసిన ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నాయకులు
  • హైదరాబాద్‌లో నియామకాలతో స్థానిక ఆదివాసీ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం
  • ఏజెన్సీ ఉద్యోగాలపై స్థానిక హక్కులు కాపాడాలి: తుడుందెబ్బ డిమాండ్

తెలుగు గళం ఏటూరునాగారం, సెప్టెంబర్ 28:

ఐదో షెడ్యూల్‌ భూభాగంలోని 29 శాఖల ఉద్యోగాల నియామక ప్రక్రియకు సంబంధించిన జిల్లా స్థాయి ఎంపిక కమిటీ (డీఎల్‌ఎస్‌సీ)ని తిరిగి ఐటీడీఏల పరిధిలోనే నిర్వహించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో తుడుందెబ్బ నాయకులు ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఐదో షెడ్యూల్‌ ఏజెన్సీ ప్రాంతాల్లోని 29 శాఖల ఉద్యోగాలకు సంబంధించిన నియామక ప్రక్రియ డీఎల్‌ఎస్‌సీ, ఐటీడీఏ పరిధిలోనే స్థానికంగా జరిగేదని నాయకులు తెలిపారు. అయితే తెలంగాణ ఏర్పడిన అనంతరం ఏజెన్సీ ప్రాంతాల ఉద్యోగాలకు సంబంధించిన డీఎల్‌ఎస్‌సీ ప్రక్రియను హైదరాబాద్‌లోని గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో నిర్వహించడం వల్ల ఏజెన్సీ ప్రాంతాల స్థానిక ఆదివాసీ నిరుద్యోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల ఉద్యోగాలు స్థానిక యువతకు అందుబాటులో ఉండే విధంగా నియామక ప్రక్రియను ఆయా ఐటీడీఏల పరిధిలోనే నిర్వహించాలని తుడుందెబ్బ నాయకులు కోరారు. నియామకాలు స్థానిక పరిస్థితులకు, ఏజెన్సీ ప్రాంతాల ప్రత్యేక హక్కులకు అనుగుణంగా జరిగితేనే స్థానిక ఆదివాసీ నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఉద్యోగాలు, భూములు, వనరుల విషయంలో స్థానిక ఆదివాసీల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని నాయకులు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకోకుండా నియామక ప్రక్రియను దూర ప్రాంతం నుంచి నిర్వహించడం వల్ల స్థానిక యువతకు సమాచారం, దరఖాస్తులు, ధ్రువపత్రాల పరిశీలన, ఎంపిక ప్రక్రియ తదితర అంశాల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. అందువల్ల ఐదో షెడ్యూల్‌ భూభాగంలోని 29 శాఖల ఉద్యోగాలకు సంబంధించిన డీఎల్‌ఎస్‌సీని ఐటీడీఏల పరిధిలోనే నిర్వహించాలని, ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ ఉద్యోగాల నియామక ప్రక్రియను స్థానికంగానే చేపట్టాలని తుడుందెబ్బ నాయకులు డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ తక్షణమే స్పందించి స్థానిక ఆదివాసీ నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జాతీయ ఉపాధ్యక్షులు పొడెం బాబు, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి, తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు పులిసే బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *