- ప్రజావాణిలో 24 దరఖాస్తుల స్వీకరణ
- భూ సమస్యలపై 15 దరఖాస్తులు
- ప్రజా సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి
- – అధికారులకు రెవెన్యూ అదనపు కలెక్టర్ సిహెచ్.మహేందర్ జి ఆదేశం
తెలుగు గళం ములుగు, సెప్టెంబర్ 28:
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తును ప్రాధాన్యతతో పరిశీలించి, సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ సిహెచ్.మహేందర్ జి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ములుగు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ సిహెచ్.మహేందర్ జి, అదనపు కలెక్టర్ సంపత్ రావుతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు తమ వినతులను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 24 దరఖాస్తులు అందగా, వాటిలో 15 దరఖాస్తులు భూ సమస్యలకు, 3 దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్లకు, 4 దరఖాస్తులు ఉద్యోగాలకు, మరో 2 దరఖాస్తులు ఇతర సమస్యలకు సంబంధించినవిగా ఉన్నాయి. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో నమ్మకంతో ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నారని, వారి దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులకు దరఖాస్తులను వెంటనే పంపించి, అవసరమైన చోట క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి, నిబంధనల ప్రకారం అర్హత ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి ద్వారా అందిన దరఖాస్తులపై తీసుకున్న చర్యలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, పెండింగ్లో ఉంచకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సమర్థవంతంగా అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో రవికుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
