బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిషీధర్ రెడ్డి
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ),ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్లను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయ దుష్ప్రచారంలో భాగమేనని బీజేపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషీధర్ రెడ్డి విమర్శించారు.సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఈసీపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తూ ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడం తగదన్నారు.కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం సంస్థాగత ప్రక్రియలో భాగమేనని,దాన్ని చీలికగా చిత్రీకరించడం సరికాదని స్పష్టం చేశారు.ఫారం-6,ఎస్ఐఆర్,ఈసీఐనెట్ వంటి అంశాల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తుండటంపై మండిపడుతూ..అందుకు తగిన ఆధారాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని,అర్హులైన ఏ ఒక్క ఓటరుకు నష్టం వాటిల్లకుండా చూడాలని ఈసీని కోరారు.ఎన్నికల ప్రక్రియ,ఓటర్ల డేటా భద్రతపై ప్రజల్లో అపోహలు సృష్టించకుండా రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని,అభ్యంతరాలుంటే చట్టబద్ధమైన మార్గాల్లో ఫిర్యాదు చేయాలని నిషీధర్ రెడ్డి సూచించారు.
