ఒక దూడను బలితీసుకున్న హైనా.. మరో దూడపై దాడి
అధికారులు వస్తున్నారు.. చూస్తున్నారు.. వెళ్లిపోతున్నారు.. రైతులకు మాత్రం భయం తప్పడం లేదు

ధర్మసాగర్ (తెలుగు గళం), సెప్టెంబర్ 29: ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో హైనా దాడులు ఆగడం లేదు. వరుస ఘటనలతో రైతులు, పాడి రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఒక దూడ హైనా దాడిలో మృతి చెందగా, తాజాగా మరో దూడపై దాడి జరగడం గ్రామంలో కలకలం రేపుతోంది. దాడులు జరిగిన ప్రతిసారీ అధికారులు గ్రామానికి వచ్చి పరిశీలిస్తున్నప్పటికీ, హైనా సంచారాన్ని అరికట్టేందుకు శాశ్వత రక్షణ చర్యలు మాత్రం కనిపించడం లేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం పాడి రైతు రాజారపు సదయ్య కౌలు చేస్తున్న బావి వద్ద సుమారు సంవత్సరం వయసున్న దూడపై హైనా దాడి చేసి చంపింది. ఆ ఘటన మరువకముందే అదే ప్రాంతంలో మరో దూడపై హైనా దాడి చేయడం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా దూడ చెవులు, ముఖంపై హైనా దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. దూడను కట్టేసిన తాడు తెగిపోవడంతో అది తల్లి వద్దకు చేరుకుని ప్రాణాలు కాపాడుకుందని రైతు తెలిపారు.

పరిశీలనలేనా.. రక్షణ చర్యలు ఎక్కడ?

హైనా దాడులపై సమాచారం అందిన ప్రతిసారీ అటవీశాఖ అధికారులు గ్రామానికి వచ్చి పరిస్థితిని పరిశీలిస్తున్నారని రైతులు చెబుతున్నారు. అయితే అధికారులు వచ్చి వెళ్లిన తర్వాత పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే ప్రాంతంలో వరుసగా దాడులు జరుగుతున్నప్పటికీ ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.

పశువులను రాత్రివేళ బయట కట్టేయాలంటేనే రైతులు వణికిపోతున్న పరిస్థితి నెలకొంది. ఒక దూడను కోల్పోయిన కుటుంబానికి మరో దూడపై దాడి జరగడంతో మరిన్ని పశువుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. హైనా సంచారం కొనసాగితే తదుపరి దాడి ఎప్పుడు, ఏ పశువుపై జరుగుతుందోనన్న భయం రైతులను వెంటాడుతోంది.

మరో ప్రాణం పోయే వరకు వేచి చూడొద్దు

ఇప్పటికే హైనా దాడితో ఒక దూడ మృతి చెందడం, మరో దూడ తీవ్రంగా గాయపడటం జరిగిన నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని రైతులు కోరుతున్నారు. కేవలం ఘటన జరిగిన తర్వాత వచ్చి పరిశీలించడం కాకుండా హైనా సంచారాన్ని గుర్తించి, పశువుల రక్షణకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

మరో పశువు బలయ్యే వరకు అధికారులు వేచి చూడకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని నారాయణగిరి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. హైనా దాడుల నుంచి పశువులను కాపాడేలా అటవీశాఖ అధికారులు స్పష్టమైన కార్యాచరణ చేపట్టాలని కోరుతున్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *