క్రికెట్ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోండి – ఆర్డిటి ప్రాంతీయ సంచాలకులు
కదిరి, అక్టోబర్ 2: అనంతపురం జిల్లాలో ఉత్తమ క్రీడాకారులను అందించడంలో కదిరి ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందిందని, ఇది ఒక ప్రముఖ క్రికెట్ కేంద్రంగా ఎదుగుతోందని ఆర్డిటి ప్రాంతీయ సంచాలకులు రఘురామ్ మరియు ఆర్డిటి క్రికెట్ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ మచ్చా రామలింగారెడ్డి పిలుపునిచ్చారు.
ఆర్డిటి ఆధ్వర్యంలో కదిరి డిగ్రీ కళాశాల మైదానంలో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు క్రికెట్ ప్రతిభాన్వేషణ ఎంపికలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కదిరి ఆర్డి రఘురామ్, ఆర్డిటి క్రికెట్ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ మచ్చా రామలింగారెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు సెలెక్టర్లు సాయి కార్తీక్ రావు, విజయ్, ప్రశాంత్ రెడ్డి, షకీర్ మరియు ఆర్డిటి గ్రాస్రూట్స్ కోఆర్డినేటర్ కె. ప్రవీణ్ కూడా ఈ ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్డి రఘురామ్ మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాలలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఆర్డిటి ఈ నూతన చొరవ తీసుకుందన్నారు. ఈ ప్రతిభాన్వేషణ కోసం కదిరి పరిసర ప్రాంతాల క్రీడాకారులు పెద్ద సంఖ్యలో తరలిరావడం ఆనందంగా ఉందన్నారు. ఎంపికైన ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారి నైపుణ్యాలను మరింత మెరుగుపరచడానికి ప్రత్యేక కోచింగ్ శిబిరాలకు పంపుతామని ఆయన స్పష్టం చేశారు.
అనంతరం మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ… కదిరి ప్రాంతం నుండి ఇప్పటికే ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు రంజీ ట్రోఫీ స్థాయికి చేరుకున్నారని గుర్తుచేశారు. గ్రామీణ ప్రాంత ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయి క్రికెట్ సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చేందుకు మాజీ భారత, ఆంధ్ర రంజీ ఆటగాళ్లతో కలిసి నేషనల్ క్రికెట్ అకాడమీ , రాష్ట్ర జట్ల శిబిరాల వంటి ప్రత్యేక శిక్షణలను నిర్వహించాలనుకుంటున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రతిభను ప్రోత్సహించి, వారికి ఉన్నతమైన శిక్షణ ఇవ్వడమే మోంచో ఫెర్రర్ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఈ ఎంపిక ప్రక్రియలో కదిరి మరియు పరిసర ప్రాంతాల నుండి మొత్తం 90 మంది యువ క్రికెట్ ఆటగాళ్లు పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఈ కార్యక్రమంలో కెఎమ్సిఎ కోశాధికారి ముబారక్, సీనియర్ క్రీడాకారులు నాగరాజ్, అనిల్, దివాకర్ రెడ్డి మరియు స్థానిక క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
