
ప్రజాపాలనలో దరఖాస్తు.. ఇంటి వద్ద ఫొటోలు.. అయినా ఆన్‌లైన్‌లో నమోదు కాని వైనం
శిథిలావస్థలో ఇల్లు.. వికలాంగ భర్తతో నిరుపేద కుటుంబం గోడు
గత గ్రామ పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యమే కారణమంటూ బాధితుల ఆరోపణ
ధర్మసాగర్, అక్టోబర్ 5 (తెలుగు గళం):
ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ తమ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదని ఓ నిరుపేద కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా ప్రస్తుతం తమ దరఖాస్తు నమోదు కాలేదనే పరిస్థితి ఏర్పడిందని బాధితురాలు కుర్సపల్లి సమ్మక్క వాపోయారు.ధర్మసాగర్ మండలం జానకిపురం గ్రామానికి చెందిన కుర్సపల్లి సమ్మక్క, ఆమె భర్త చంద్రయ్య తమ కుటుంబ పరిస్థితులను వివరిస్తూ ధర్మసాగర్ మండల గ్రీవెన్స్‌లో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. తాము ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారమని, తమకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, తన భర్త వికలాంగుడని సమ్మక్క తెలిపారు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నానని పేర్కొన్నారు.
శిథిలావస్థలో ఇల్లు.. భయంతో జీవనం
తాము నివసిస్తున్న ఇల్లు శిథిలావస్థకు చేరిందని సమ్మక్క తెలిపారు. వర్షాలు కురిసిన సమయంలో ఇల్లు ఎప్పుడు కూలిపోతుందోనన్న భయంతో కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికం కారణంగా సొంతంగా ఇల్లు నిర్మించుకునే ఆర్థిక స్థోమత తమకు లేదని, ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇల్లు తమ కుటుంబానికి ఎంతో అవసరమని తెలిపారు.
ఫొటోలు తీసినా.. ఆన్‌లైన్‌లో నమోదు కాలేదంటూ
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నామని సమ్మక్క తెలిపారు. అనంతరం అప్పటి గ్రామ పంచాయతీ కార్యదర్శి తమ ఇంటి వద్దకు వచ్చి ఫొటోలు కూడా తీసుకున్నారని చెప్పారు. అయితే ఆ తర్వాత తమ దరఖాస్తు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదని తెలిసిందన్నారు.దీంతో ఇందిరమ్మ ఇంటి మంజూరుకు అవకాశం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.విచారణ జరిపి న్యాయం చేయాలని వేడుకోలు తమకు అర్హత ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలు లేదా సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ సంక్షేమ పథకానికి దూరం కాకుండా చూడాలని సమ్మక్క, ఆమె భర్త చంద్రయ్య గ్రామ సర్పంచ్, అధికారులను కోరారు. తమ కుటుంబ పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, దరఖాస్తు ఆన్‌లైన్‌లో ఎందుకు నమోదు కాలేదో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.తాము అర్హులమని అధికారులు నిర్ధారిస్తే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి తమ కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామ సర్పంచ్, సంబంధిత అధికారులు, జిల్లా అధికారులను కోరారు.ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అనంతరం ఇంటి వద్దకు వచ్చి ఫొటోలు తీసినప్పటికీ వివరాలు ఆన్‌లైన్‌లో ఎందుకు నమోదు కాలేదనే అంశంపై అధికారులు సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. జిల్లా అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హత ఉన్న నిరుపేద కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.