
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన డీసీసీ అధ్యక్షుడు అయూబ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పరమేష్
వరంగల్: రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ఇండియా కూటమి ఎంపీల అరెస్టును నిరసిస్తూ వరంగల్ పోచమ్మైదాన్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి పరమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ పాల్గొని, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ఓట్ల తొలగింపు, ఓట్ల చోరీ, ఎస్ఐఆర్ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ఇండియా కూటమి ఎంపీలను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు.

ఓట్ల అక్రమాలపై సమాధానం చెప్పాల్సిన కేంద్ర ప్రభుత్వం.. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులపై అణచివేతకు పాల్పడటం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును ఎవరూ అణచివేయలేరని స్పష్టం చేశారు. ఓట్లను కాపాడుకోవడంతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.
సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.