మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి: ఎస్ఐ రవీంద్ర చారి
తాటికాయలలో అవగాహన కార్యక్రమం.. 300 మంది గ్రామస్థుల హాజరు

ధర్మసాగర్, అక్టోబర్ 9 (తెలుగు గళం):
యువత మత్తు పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రవీంద్ర చారి సూచించారు. వరంగల్ నగర పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాటికాయల గ్రామంలో జాగృతి పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో సామాజిక చైతన్య కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఐ రవీంద్ర చారి మాట్లాడుతూ గంజాయి, మాదకద్రవ్యాలు, గుట్కా వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. గంజాయి విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే 1908 టోల్‌ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలని సూచించారు. మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.జాగృతి పోలీస్ కళాబృందం సభ్యులు పాటలు, నాటికలు, మేజిక్ షో ద్వారా పలు సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. విద్య ప్రాముఖ్యత, రోడ్డు ప్రమాదాల నివారణ, బాల్యవివాహాల నిరోధం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, అత్యవసర సమయాల్లో డయల్ 112 వినియోగం, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ప్రాధాన్యతను పాటల రూపంలో వివరించారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సందేశమిచ్చారు.మూఢనమ్మకాలపై మేజిక్ షో నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంచారు. సైబర్ నేరాలపై ప్రత్యేక నాటికను ప్రదర్శించి, సైబర్ మోసాలకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సైబర్ నేరాల బారిన పడినప్పుడు వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. కళాబృందం ప్రదర్శించిన పాటలు, నాటికలు గ్రామస్థులను ఆలోచింపజేసి సామాజిక బాధ్యతపై చైతన్యం కలిగించాయి.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, కళాబృందం ఇన్చార్జి మహిళా ఏఎస్ఐ నాగమణి, హెడ్ కానిస్టేబుళ్లు విలియం, వెంకటేశ్వర్లు, పోలీస్ కానిస్టేబుల్ పూల్ సింగ్, హోంగార్డులు శ్రీనివాస్, నారాయణ, విక్రమ్ రాజు, చిరంజీవి, కళాబృందం సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు. సుమారు 300 మంది ప్రజలు హాజరై కార్యక్రమాన్ని వీక్షించారు.