తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా పూల పండుగ

ధర్మసాగర్, అక్టోబర్ 10 (E69NEWS):
ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలోని శివాలయం వద్ద ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను గ్రామ మహిళలు ఘనంగా నిర్వహించారు. తంగేడు, గునుగు, బంతి, చామంతి, గోరింట తదితర సహజ పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, సంప్రదాయ పాటలు నృత్యాలతో శివాలయ పరిసరాలు పండుగ శోభను సంతరించుకున్నాయి.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పుట్ట రేణుక కుమారస్వామి మాట్లాడుతూ,బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు,ప్రకృతి ప్రేమకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.ఆశ్వయుజ మాసంలో తొమ్మిది రోజులపాటు నిర్వహించే ఈ పూల పండుగకు తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉందన్నారు.సహజ పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మను పూజించడం ఈ పండుగ ప్రత్యేకతని పేర్కొన్నారు. ప్రకృతికి, మనిషికి మధ్య ఉన్న విడదీయలేని అనుబంధాన్ని బతుకమ్మ చాటిచెబుతుందని, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తుందని తెలిపారు. మహిళలు, యువతులు సమూహాలుగా చేరి వేడుకలు నిర్వహించడం ద్వారా సమాజంలో ఐక్యత, సోదరభావం పెంపొందుతాయని అన్నారు.భావితరాలకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేయడంతో పాటు ప్రకృతి పరిరక్షణపై బాధ్యతను పెంపొందించడంలో బతుకమ్మ వేడుకలు కీలకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ వల్లెపు రెడ్డి సంధ్య రాజమారెడ్డి, వార్డు సభ్యులు, నాయకులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.