దసరా పండుగ అదునుగా అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలా?
నిబంధనలు బేఖాతరు చేస్తున్నారనే ఆరోపణలు.. ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నట్లు?
E69 న్యూస్ హన్మకొండ/అయినవోలు అక్టోబర్ 19

దసరా పండుగను ఆసరాగా చేసుకుని అయినవోలులోని రాజరాజేశ్వరి వైన్స్లో మద్యం విక్రయాలు అర్ధరాత్రి వరకు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.సాధారణంగా రాత్రి పది గంటల తర్వాత మద్యం విక్రయాలు నిలిపివేయాల్సి ఉండగా, ఆ సమయం దాటినా అమ్మకాలు కొనసాగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు.పండుగ వేళ మద్యం విక్రయాలు పెరిగే అవకాశాన్ని ఆసరాగా చేసుకుని నిబంధనలను పక్కనపెట్టి వ్యాపారం సాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.పండుగకు ముందే మద్యం విక్రయాలపై నియంత్రణ ఉండాల్సిన సమయంలో, నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా అమ్మకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.మద్యం దుకాణాలపై నిఘా పెట్టాల్సిన సంబంధిత శాఖల అధికారులు ఏం చేస్తున్నారనే చర్చ స్థానికంగా సాగుతోంది.నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఈ వ్యవహారాన్ని ఎందుకు పరిశీలించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
పండుగ పేరుతో నిబంధనలకు తిలోదకాలా?
దసరా పండుగ సందర్భంగా మద్యం విక్రయాల సమయాలపై ప్రత్యేక నిఘా ఉండాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అయినవోలు రాజరాజేశ్వరి వైన్స్లో రాత్రి పది గంటల తర్వాత విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై ఎక్సైజ్ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు.ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.పండుగ సందడిలో నిబంధనల ఉల్లంఘనలకు అవకాశం ఇవ్వకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తనిఖీలు చేపడతారా? లేక మద్యం విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతాయా? అన్నది వేచి చూడాలి.