- ప్రజల రక్షణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం:-ఎస్పీ కేకాన్ సుధీర్ రామ్‌నాథ్
- పోలీసు సిబ్బంది క్షేమం.. ప్రజల శాంతి కోసం ప్రత్యేక పూజలు
- జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ
తెలుగు గళం ములుగు, అక్టోబర్ 19:
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ములుగు జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో జిల్లా ఎస్పీ కేకాన్ సుధీర్ రామ్‌నాథ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఆయుధ పూజ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ విధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాలు, పోలీసు వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీసు సిబ్బంది ఆయురారోగ్యాలతో ఉండాలని, జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీసు సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సూచించారు. పండుగల సమయంలో ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు జరుపుకునేలా పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా ప్రజలందరికీ జిల్లా పోలీస్ శాఖ తరఫున విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఏటూరునాగారం మనన్ భట్ ఐపీఎస్, అదనపు ఎస్పీ సదానందం, డీసీఆర్బీ డీఎస్పీ కిషోర్ కుమార్, ములుగు డీఎస్పీ నలువాల రవీందర్, ములుగు సీఐ దారం సురేష్, ఆర్ఐలు స్వామి, తిరుపతి, వెంకటనారాయణ, శ్రీకాంత్, ములుగు ఎస్ఐ వెంకటేశ్వర్లు, వెంకటాపురం ఎస్ఐ చల్లా రాజు, ఎస్ఐలు తాజుద్దీన్, కృష్ణ ప్రసాద్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
