ధ్రువపత్రాల చెల్లుబాటుపై స్పష్టత ఏదీ?
అనుమతులు ఉన్నాయా? గుర్తింపు ఉందా? ఉద్యోగాలకు అర్హత కల్పిస్తాయా?
అభ్యర్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు.. సమగ్ర విచారణ జరపాలని డిమాండ్
హైదరాబాద్, అక్టోబర్, ప్రతినిధి
తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రెటరీ ఉమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన లైఫ్‌గార్డ్, వాటర్ సేఫ్టీ శిక్షణ కోర్సు నిర్వహణపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోర్సుకు అవసరమైన అనుమతులు, శిక్షణ అనంతరం జారీ చేసిన ధ్రువపత్రాల చెల్లుబాటు, వాటి ఆధారంగా ఉద్యోగాలు పొందే అర్హతపై స్పష్టత ఇవ్వాలని అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్, స్విమ్మింగ్ ఫెడరేషన్ వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఏడాది మే 1 నుంచి 3వ తేదీ వరకు హైదరాబాద్‌లోని జీఎంసీ బాలయోగి ఆక్వాటిక్ స్టేడియం ప్రాంగణంలోని ఆక్వాటిక్ కాంప్లెక్స్‌లో ఈ కోర్సు నిర్వహించినట్లు సమాచారం. అయితే, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సంబంధిత సంస్థలకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? అభ్యర్థులకు అందించిన ధ్రువపత్రాలను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఆమోదిస్తాయా? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు రావాల్సి ఉంది.
లైఫ్‌గార్డ్, వాటర్ సేఫ్టీ కోర్సును నిర్వహించేందుకు తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్‌కు నిబంధనల ప్రకారం అర్హత ఉందా? స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి ముందస్తుగా లిఖితపూర్వక అనుమతి తీసుకున్నారా? సంబంధిత నిర్వహణ కమిటీ ఆమోదం పొందారా? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కోర్సు నిర్వహణకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు, అనుమతి పత్రాలు, గుర్తింపు వివరాలను బహిర్గతం చేస్తే అభ్యర్థుల్లో నెలకొన్న సందేహాలకు తెరపడే అవకాశం ఉంది.
ఈ కోర్సు ద్వారా జారీ చేసిన ధ్రువపత్రాలకు స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉందా? ఇతర సంస్థల పేర్లు లేదా గుర్తింపులను ప్రస్తావించినట్లయితే, అందుకు సంబంధించిన అధికారిక ఆధారాలేమిటి? ఈ ధ్రువపత్రాలను ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థలు ఉద్యోగ నియామకాల్లో అర్హతగా పరిగణిస్తాయా? అనే ప్రశ్నలకూ సమాధానాలు ఇవ్వాల్సి ఉంది.
కోర్సు నిర్వహణకు అవసరమైన అనుమతులు, ధ్రువపత్రాల గుర్తింపుపై స్పష్టత లేకపోవడంతో శిక్షణ పొందిన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము కష్టపడి సమయం కేటాయించడంతోపాటు డబ్బు వెచ్చించి శిక్షణ పొందామని, ఇప్పుడు ధ్రువపత్రాల చెల్లుబాటుపై సందేహాలు తలెత్తడం తమ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోందని వాపోతున్నారు. అధికారికబ గుర్తింపు లేని ధ్రువపత్రాలు తమకు అందాయేమోనన్న ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రధానంగా రాష్ట్రంలో ఈత, డైవింగ్, వాటర్ పోలో క్రీడలను ప్రోత్సహించడం, పోటీలు నిర్వహించడం, క్రీడాకారుల ఎంపిక చేపట్టడం, జాతీయ, జోనల్ స్థాయి పోటీల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవడం వంటి బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది అయితే, ఈ క్రీడా కార్యకలాపాల నిర్వహణ, నియంత్రణకు సంబంధించిన బాధ్యతలకు భిన్నంగా లైఫ్ సేవింగ్, వాటర్ సేఫ్టీ శిక్షణా కోర్సులను నిర్వహించడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సదరు కోర్సులను నిర్వహించేందుకు అసోసియేషన్‌కు ఏ మేరకు అధికారం ఉంది? సంబంధిత శాఖల అనుమతులు, గుర్తింపు ఉన్నాయా? కోర్సు నిర్వహణకు అనుసరించాల్సిన నిబంధనలు ఏమిటి? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది.
లైఫ్ సేవింగ్, వాటర్ సేఫ్టీ శిక్షణ అనేవి ప్రజల ప్రాణరక్షణతో ముడిపడిన కీలకమైన అంశాలు. ఈ కోర్సులను నిర్వహించే సంస్థలకు తగిన గుర్తింపు, శిక్షణా ప్రమాణాలు, ధ్రువపత్రాల జారీకి సంబంధించిన అధికారాలు ఉండటం అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో, సంబంధిత రంగంలో గుర్తింపు పొందిన సంస్థల అనుబంధం లేదా అనుమతి లేకుండా ఇటువంటి కోర్సులు నిర్వహించినట్లయితే, వాటి చట్టబద్ధతపై ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది.
తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యవర్గ నిర్వహణ కల్పనపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసోసియేషన్‌లోని కమిటీ సభ్యులందరినీ సమన్వయం చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, కార్యదర్శి ఉమేష్ తనకు అనుకూలంగా ఉన్న కొందరు సభ్యులతోనే వ్యవహారాలను నడిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లా స్థాయిలోనూ స్విమ్మింగ్ అసోసియేషన్ లో అర్హత ఉన్న వారిని పక్కన పెట్టి, స్విమ్మింగ్ తోసంబంధం లేని వారికి సైతం ముడుపులు చెల్లిస్తే బ్యాక్ డోర్ పద్ధతిలో అఫియేషన్ ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
లైఫ్‌గార్డ్, వాటర్ సేఫ్టీ కోర్సును నిర్వహించేందుకు స్కిల్ ఇండియాతో అనుబంధం కలిగిన రాష్ట్రీయ లైఫ్ సేవింగ్ సొసైటీ లేదా నోబుల్ లైఫ్ సేవింగ్ సొసైటీ వంటి సంస్థల గుర్తింపు అవసరమని పేర్కొంటున్న నేపథ్యంలో, ఈ అంశంపై సంబంధిత అధికారులు, తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ స్పష్టత ఇవ్వాలి. కోర్సు నిర్వహణకు ఉన్న అధికారిక అనుమతులు, గుర్తింపు వివరాలు, శిక్షణా విధానం, సర్టిఫికెట్ల చెల్లుబాటు, వాటి ఆధారంగా ఉద్యోగాలకు ఉండే అర్హత వంటి అంశాలను బహిర్గతం చేయాలి. అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉందా? అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. శిక్షణ పేరుతో యువత సమయం, డబ్బు వృథా కాకుండా సంబంధిత క్రీడా సంస్థలు, ప్రభుత్వ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఫెడరేషన్ జోక్యం చేసుకోవాలి
ఈ వ్యవహారంపై స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుని, కోర్సు నిర్వహణకు సంబంధించిన అనుమతులు, గుర్తింపు, ధ్రువపత్రాల చెల్లుబాటుపై సమగ్ర విచారణ జరపాలని అభ్యర్థులు కోరుతున్నారు. కోర్సు నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు తేలితే బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ధ్రువపత్రాలకు గుర్తింపు లేకపోవడం వల్ల అభ్యర్థులు నష్టపోయినట్లు నిర్ధారణ అయితే, వారికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ అంశాన్ని సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించాలని, కోర్సు నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను బహిరంగపరచాలని వారు కోరుతున్నారు. అనుమతులు, గుర్తింపు, ఉద్యోగ అర్హతపై అధికారిక ప్రకటన వెలువడితేనే ఈ వ్యవహారంపై నెలకొన్న సందిగ్ధత తొలగి, శిక్షణ పొందిన అభ్యర్థులకు భరోసా లభించనుంది.
