ప్రజల గోస పట్టని అధికారులు!
- ప్రజల ప్రాణాలతో చెలగాటమా? – మాటూరి ఏడుకొండలు
- ఇసుక ఆదాయంపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై ఏదీ? మంత్రి సీతక్క స్పందించాలి!
తెలుగు గళం, మంగపేట, అక్టోబర్ 28:
ములుగు జిల్లా మంగపేట మండలం వాడగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని పాలాయగూడెం వద్ద ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రహదారిపై గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని బీఆర్ఎస్ ములుగు జిల్లా నాయకుడు మాటూరి ఏడుకొండలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో తుఫాను, భారీ వర్షాల ప్రభావంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో, కీలకమైన ప్రధాన రహదారిపై రెండు మూడు గంటల పాటు వాహనాలు నిలిచిపోయినా సంబంధిత అధికారులు స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. వాహనదారులు, ప్రయాణికులు గంటల తరబడి రహదారిపైనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొనడం ఆందోళనకరమని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడం, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం, అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా చూడటం అధికార యంత్రాంగం కనీస బాధ్యత అని పేర్కొన్నారు. అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పోలీసు, సంబంధిత శాఖల అధికారులు సకాలంలో స్పందించకపోవడం ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోందన్నారు. ప్రభుత్వానికి ఇసుక ఆదాయంపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై ఎందుకు లేదని మాటూరి ఏడుకొండలు ప్రశ్నించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా మంత్రి సీతక్క ములుగు జిల్లాలోని రహదారి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, పాలాయగూడెం వద్ద ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలు, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చి అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు.
