- తాడ్వాయి, వాజేడు, కన్నాయిగూడెంను కరువు మండలాలుగా ప్రకటించాలి!
- ఇప్పటికే గుర్తించిన మండలాల కంటే ఈ మూడు మండలాల్లోనే కరువు ప్రభావం అధికం..
- పంట నష్టంతో కుదేలవుతున్న ఆదివాసీ రైతులు..
- క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే కరువు మండలాల జాబితాలో చేర్చాలి
- ఆదివాసీ రైతులను ఆదుకోవాలి: తుడుం దెబ్బ జాతీయ ఉపాధ్యక్షులు పొడెం బాబు
తెలుగు గళం ములుగు, అక్టోబర్ 28:
ములుగు జిల్లాలోని తడ్వాయి, వాజేడు, కన్నాయిగూడెం మండలాలను కూడా కరువు మండలాలుగా గుర్తించి, ఆదివాసీ రైతులకు న్యాయం చేయాలని తుడుం దెబ్బ జాతీయ ఉపాధ్యక్షులు పొడెం బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే జిల్లాలోని నాలుగు మండలాలను కరువు మండలాలుగా గుర్తించినప్పటికీ, పూర్తిస్థాయి ఏజెన్సీ ప్రాంతాలుగా ఉన్న ఈ మూడు మండలాలను విస్మరించడం బాధాకరమని ఆయన అన్నారు. ఇప్పటికే కరువు మండలాలుగా ప్రకటించిన నాలుగు మండలాల కంటే తడ్వాయి, వాజేడు, కన్నాయిగూడెం మండలాల్లోనే కరువు ప్రభావం అధికంగా ఉందని ఆయన పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులు, పంటల దిగుబడి తగ్గడం, పంట నష్టాల కారణంగా ఈ ప్రాంతాల్లోని ఆదివాసీ రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయంపైనే ఆధారపడి జీవించే గిరిజన కుటుంబాలు పంట నష్టాలతో జీవనోపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. పూర్తిస్థాయి ఏజెన్సీ ప్రాంతాలైన ఈ మూడు మండలాలను కరువు మండలాల జాబితాలో చేర్చకపోవడం ఆదివాసీ రైతులకు అన్యాయం చేయడమేనని పొడెం బాబు అన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించకుండా కేవలం మండలాల ఎంపికకే పరిమితం కాకుండా, ఆయా ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం, సాగు పరిస్థితులు, పంటల నష్టం, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సమగ్రంగా అంచనా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని, అర్హత ప్రమాణాల ఆధారంగా తడ్వాయి, వాజేడు, కన్నాయిగూడెం మండలాలను కరువు మండలాలుగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరువు ప్రభావంతో నష్టపోయిన అర్హులైన ఆదివాసీ రైతులకు పంట నష్టపరిహారం, కరువు సహాయక చర్యలు, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు అందించాలని స్పష్టం చేశారు. ఆదివాసీ రైతుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించాలని, వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న గిరిజన కుటుంబాలకు భరోసా కల్పించాలని పొడెం బాబు కోరారు. కరువు పరిస్థితులపై వాస్తవాలను గుర్తించి, అర్హులైన రైతులకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు పులిసే బాలకృష్ణ, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి, రాష్ట్ర కార్యదర్శి దబ్బగట్ల శ్రీకాంత్, ఆదివాసీ విద్యార్థి సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు గుండ్ల పాపారావు, కన్నాయిగూడెం మండల అధ్యక్షులు కోరగట్ల సాయి, విద్యార్థి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
