మత్స్యకారులు చేతివృత్తిదారులు చిరు వ్యాపారులతో మమేకం
స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కదలాలి
తెలుగుగళం న్యూస్,శింగనమల.
శింగనమల మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం హోరెత్తింది. నియోజకవర్గ శాసనసభ్యురాలు బండారు శ్రావణి శ్రీ కూటమి అభ్యర్థుల విజయానికి మద్దతుగా బుధవారం విస్తృతంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శింగనమల ఎంపీటీసీ-1 అభ్యర్థి కాయల బాలకృష్ణ ఎంపీటీసీ-2 అభ్యర్థి తొట్ల అనురాధలకు సైకిల్ గుర్తుపై జడ్పీటీసీ అభ్యర్థి ఎం. పెద్దిరాజుకు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గ్రామంలోని మత్స్యకార కుటుంబాలను కలిసి వారి జీవన విధానాలను ఉపాధి సమస్యలను అడిగితెలుసుకున్నారు. మత్స్యకారులు చేతివృత్తిదారులు చిరు వ్యాపారుల ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రభుత్వ సహాయ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్రామంలోని కార్పెంటర్లు హెయిర్ సెలూన్ నిర్వాహకులు కిరాణా దుకాణదారులు చికెన్ సెంటర్ల యజమానులు పండ్లు పూల వ్యాపారులు టీ హోటళ్ల నిర్వాహకులతో ఆమె స్వయంగా మమేకమై వారి దైనందిన సమస్యలపై చర్చించారు. చిన్న వ్యాపారాల ద్వారా జీవనం సాగిస్తున్న ప్రతి కుటుంబానికి కూటమి ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అండగా నిలుస్తున్నాయో వివరిస్తూ వారి ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి స్థానిక సంస్థలే కీలకమని క్షేత్రస్థాయి నుంచి ప్రజలకు నిరంతరం సేవలందించే బలమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో అందించిన సుపరిపాలనను ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కళ్లముందుంచుతూ తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలలో నూతన ఉత్తేజాన్ని నింపారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గ్రామ పురవీధుల్లో పర్యటిస్తున్న సమయంలో మహిళలు ముఖ్యంగా నాయి బ్రాహ్మణ కాలనీకి చెందిన మహిళలు కనులపండువగా ఘన స్వాగతం పలికారు. గ్రామాభివృద్ధికి ఆమె చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ హారతులు పట్టారు. అనంతరం స్థానిక మసుద్ స్వామి దర్గాను సందర్శించిన ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ముఖ్య నాయకులు నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
