హమాలీ కార్మికుల ఉపాధికి భరోసా ఇచ్చిన పౌరసరఫరాల శాఖ రాష్ట్ర జనరల్ మేనేజర్
తెలుగు గళం ఈ69 న్యూస్ | జనగామ | అక్టోబర్ 29, 2026

జనగామ జిల్లాలోని MLS పాయింట్లలో పనిచేస్తున్న 57 మంది సివిల్ సప్లై హమాలీ కార్మికుల ఉపాధిని పరిరక్షిస్తామని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ జనరల్ మేనేజర్ సాయి అరుణ్ కుమార్ హామీ ఇచ్చారు. MLS పాయింట్ల ద్వారానే రేషన్ బియ్యం సరఫరా కొనసాగిస్తామని, ఈ విధానానికి విరుద్ధంగా జనగామ జిల్లాలో జారీ చేసిన సంబంధిత ఉత్తర్వులను రద్దు చేస్తామని స్పష్టం చేశారు.జనగామ, స్టేషన్ ఘన్పూర్, కొడకండ్ల MLS పాయింట్లలో గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న 57 మంది హమాలీ కార్మికుల ఉపాధికి ముప్పు ఏర్పడిన నేపథ్యంలో ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ (CITU) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు నేతృత్వంలో నాయకులు గురువారం రాష్ట్ర జనరల్ మేనేజర్ సాయి అరుణ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.జనగామ జిల్లా అదనపు కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు బఫర్ గోదాముల నుంచి నేరుగా రేషన్ దుకాణాలకు బియ్యం తరలించే చర్యలు చేపట్టడంతో MLS పాయింట్లలో పనిచేస్తున్న హమాలీ కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని నాయకులు వివరించారు. ఈ నెల 13వ తేదీన కూడా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో జనరల్ మేనేజర్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లామని తెలిపారు. సంబంధిత ఉత్తర్వులను రద్దు చేయాలని సూచించినప్పటికీ జిల్లా స్థాయిలో పరిస్థితి మారకపోవడంతో మరోసారి వినతిపత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు.మూడు దశాబ్దాలుగా ప్రజా పంపిణీ వ్యవస్థలో సేవలందిస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్న హమాలీ కార్మికుల ఉపాధిని దెబ్బతీయవద్దని వంగూరు రాములు, ఇతర నాయకులు కోరారు. కార్మిక కుటుంబాలకు జీవన భద్రత కల్పించేలా MLS పాయింట్ల ద్వారానే రేషన్ బియ్యం సరఫరా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.నాయకుల వినతిపై స్పందించిన జనరల్ మేనేజర్ సాయి అరుణ్ కుమార్ MLS పాయింట్ల ద్వారానే బియ్యం సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే జనగామ జిల్లా మేనేజర్‌కు ఈ విషయాన్ని తెలియజేసి, MLS పాయింట్ల నుంచే రేషన్ దుకాణాలకు బియ్యం పంపించాలని సూచించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో CITU జనగామ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు, సివిల్ సప్లై హమాలీ యూనియన్ జిల్లా ప్రతినిధులు బోరెల్లి సోమయ్య, పిట్టల తిరుపతి, జూకంటి పర్వతాలు, ఎదునూరి బిక్షపతి, రాపోలు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.