వరంగల్–జనగామ మధ్య తమ్మడపల్లి మీదుగా ఆర్టీసీ బస్సు నడపాలి
ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇచ్చిన హామీని నెరవేర్చాలి: బీఆర్ఎస్ యువజన నాయకుడు కొంతం నగేష్ డిమాండ్
జఫర్గఢ్, నవంబర్ 24 ( ఈ69న్యూస్ -తెలుగు గళం)

వరంగల్ నుంచి జనగామ వరకు తమ్మడపల్లి (జి) మీదుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని తమ్మడపల్లి జి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు కొంతం నగేష్ డిమాండ్ చేశారు. గత కొన్ని నెలల క్రితం ఎమ్మెల్యే కడియం శ్రీహరి గ్రామంలో పర్యటించిన సందర్భంగా వరంగల్ నుంచి తమ్మడపల్లి మీదుగా జనగామ వరకు బస్సు నడపాలని గ్రామస్తులు కోరగా, త్వరలోనే బస్సు సౌకర్యం కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే ఇప్పటివరకు ఆ హామీ అమలుకు నోచుకోలేదని ఆయన పేర్కొన్నారు.జఫర్గఢ్ మండలానికి చివరి గ్రామంగా, పాలకుర్తి ప్రాంతానికి సమీపంలో ఉన్న తమ్మడపల్లి (జి) మారుమూల గ్రామం కావడంతో రవాణా సౌకర్యాల కొరత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. జిల్లా కేంద్రమైన జనగామకు వెళ్లాలన్నా, వరంగల్ పట్టణానికి చేరుకోవాలన్నా ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని తెలిపారు.ముఖ్యంగా వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందేందుకు వెళ్లే రోగులు, మార్కెట్లకు వెళ్లే ప్రజలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అదేవిధంగా జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వెళ్లే ప్రజలు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వస్తోందన్నారు.గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే కడియం శ్రీహరి గతంలో ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని కొంతం నగేష్ కోరారు.వరంగల్ నుంచి తమ్మడపల్లి (జి) మీదుగా జనగామ వరకు నిత్యం ఆర్టీసీ బస్సు నడిపేలా సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


