జవహర్నగర్ ఏసీపీ చక్రపాణి చేతుల మీదుగా సభ్యులకు సన్మానం

హైదరాబాద్ నవంబర్ 24(ఈ69న్యూస్ -తెలుగు గళం న్యూస్)
సమాజంలో మానవ హక్కుల పరిరక్షణ, చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జవహర్నగర్ ఏసీపీ చక్రపాణి సూచించారు.హ్యూమన్ రైట్స్ అండ్ లీగల్ అవేర్నెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా బృందానికి గుర్తింపు కార్డులు, ప్రశంసా పత్రాలు అందజేసి సన్మానించారు.మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని జవహర్నగర్ ఏసీపీ చక్రపాణి ముఖ్య అతిథిగా పాల్గొని అసోసియేషన్ సభ్యులకు ఐడీ కార్డులు, ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఏసీపీ చక్రపాణి మాట్లాడుతూ..సమాజంలో ప్రతి పౌరుడికి తన హక్కులపై అవగాహన ఉండటం ఎంతో అవసరమని అన్నారు. ముఖ్యంగా సామాన్య ప్రజలకు చట్టాలపై సరైన అవగాహన కల్పించడం, వారి హక్కుల పరిరక్షణకు కృషి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.మానవ హక్కుల పేరుతో పనిచేసే సంస్థల ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, చట్ట పరిధిలో ఉంటూ ప్రజలకు సేవలందించాలని సూచించారు.బాధితులకు న్యాయపరమైన మార్గదర్శకత్వం అందించడం, అన్యాయానికి గురైన వారికి అండగా నిలవడం, ప్రజల్లో చట్టాల పట్ల అవగాహన పెంపొందించడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.అసోసియేషన్ సభ్యులు తమకు కేటాయించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, సమాజంలో శాంతి, సామాజిక న్యాయం, చట్టబద్ధమైన విలువల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. గుర్తింపు కార్డులు, ప్రశంసా పత్రాలు పొందిన సభ్యులు మరింత బాధ్యతతో పనిచేస్తూ సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా అసోసియేషన్ వ్యవస్థాపకులు కె. కమలాకర్ మాట్లాడుతూ సంస్థ లక్ష్యాలు, కార్యకలాపాలను వివరించారు. మానవ హక్కుల పరిరక్షణతో పాటు ప్రజలకు న్యాయపరమైన అవగాహన కల్పించడం, సామాజిక సమస్యల పరిష్కారానికి చట్టబద్ధంగా కృషి చేయడం తమ సంస్థ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ అండ్ లీగల్ అవేర్నెస్ అసోసియేషన్ వ్యవస్థాపకులు కె. కమలాకర్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు ముహమ్మద్ ఇక్బాల్, వర్కింగ్ ప్రెసిడెంట్ ముహమ్మద్ సలీం, జనరల్ సెక్రటరీ గొల్లపల్లి అనిల్, జిల్లా కార్యదర్శి సింగారపు రాజు, జిల్లా మహిళా వైస్ ప్రెసిడెంట్ రాణీ, గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ ముహమ్మద్ ఉమర్ తదితరులు పాల్గొన్నారు.

