- వ్యవసాయ మోటార్ పనులు చేస్తుండగా 11 కేవీ విద్యుత్ ప్రమాదం.. అక్కడికక్కడే మృతి!
- కుటుంబానికి ఆధారమైన రైతు మృతి.. భార్య, ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలిన విషాద ఘటన!
తెలుగు గళం ఏటూరునాగారం, నవంబర్ 24:
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామపంచాయతీ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌కు గురై షేక్ బషీర్ (40) అనే యువరైతు ప్రాణాలు కోల్పోయాడు. గ్రామ పరిధిలోని తన వ్యవసాయ పొలంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద వ్యవసాయ మోటార్‌కు సంబంధించిన పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ షాక్ తగలడంతో బషీర్ అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబానికి అండగా ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న బషీర్ ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. కుటుంబానికి ప్రధాన ఆధారమైన వ్యక్తి మృతిచెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఈ విషాద ఘటనతో చిన్నబోయినపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి విద్యుత్ ప్రమాదాలు పునరావృతం కాకుండా ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్ల వద్ద తగిన భద్రతా చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. అదేవిధంగా మృతుడి కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన ఆర్థిక సహాయం అందించి, భార్యా పిల్లలను ఆదుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.


