ఏటూరునాగారం ఐటీడీఏ నూతన ఏపీఓగా బాధ్యతలు స్వీకరించిన సున్నం రాంబాబును ఆదివాసీ ప్రజాసంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ గిరిజన ప్రజలు నేటికీ అనేక మౌలిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, పోడు భూముల సమస్యల పరిష్కారంతో పాటు గిరిజన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ముఖ్యంగా షెడ్యూల్డ్ ఏరియాలో రాజ్యాంగం కల్పించిన ఆదివాసీ హక్కులు, ప్రత్యేక చట్టాలు సమర్థవంతంగా అమలయ్యేలా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గిరిజనుల సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే ఆదివాసీ ప్రజాసంఘాలు ప్రజల తరఫున అధికారుల దృష్టికి తీసుకువచ్చే సమస్యలను సానుకూలంగా పరిశీలించి, పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి, గిరిజనుల సంక్షేమం లక్ష్యంగా నూతన ఏపీఓ సున్నం రాంబాబు ప్రత్యేక శ్రద్ధ చూపుతారని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరోసారి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ ప్రజాసంఘాల నాయకులు ఈసం యాదయ్య, పోలేబోయిన ఆదినారాయణ, ఈసం రాజు, ఆక తిరుమల్ రావు, అనేబోయిన సమ్మయ్య, తోలేం సుధాకర్, తాటి నాగరాజు, ఈసం కృష్ణ కుమార్, కురుసం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.