18 నుంచి 59 ఏళ్ల వారికి రూ.5 లక్షల ఉచిత జీవిత బీమా
డిసెంబర్ 18లోపు నమోదు చేసుకోవాలి- వార్డు మెంబర్ గుండె లక్ష్మణ్
స్టేషన్ ఘన్పూర్ నవంబర్ 26 (ఈ69న్యూస్ -తెలుగు గళం న్యూస్)

పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సముద్రాల గ్రామ మూడో వార్డు మెంబర్, ఘన్పూర్ మండల వార్డు మెంబర్ల ఫోరం ఇన్చార్జ్ గుండె లక్ష్మణ్ కోరారు.గురువారం సముద్రాల గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులకు పథకం కరపత్రాలను పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. ఈ పథకం ద్వారా 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన కుటుంబంలో సంపాదించే వ్యక్తికి ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే ప్రభుత్వం రూ.5 లక్షల ఉచిత జీవిత బీమా సౌకర్యం కల్పిస్తోందని వివరించారు.గ్రామంలో మొత్తం 1,300 మంది అర్హులైన లబ్ధిదారులు ఉండగా, ఇప్పటివరకు కేవలం 450 మంది మాత్రమే నమోదు చేసుకున్నారని తెలిపారు. ఇంకా 850 మంది అర్హులు నమోదు చేసుకోవాల్సి ఉందన్నారు.అర్హులైన వారు నిర్లక్ష్యం చేయకుండా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నంబర్, నామినీ వివరాలతో డిసెంబర్ 18వ తేదీలోపు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో నమోదు చేసుకోవాలని గుండె లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా భరోసా అందేలా గ్రామస్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.


