నాడు కాకుల బెడద.. నేడు ఈగల దాడి!

ధర్మసాగర్, (ఈ69న్యూస్ – తెలుగు గళం) నవంబర్ 27

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం క్యాతంపెల్లి గ్రామస్తులకు పౌల్ట్రీ ఫామ్ సమస్య తీవ్ర ఇబ్బందిగా మారింది. గ్రామ శివారులో నిర్వహిస్తున్న అరుణాదేవి పౌల్ట్రీ ఫామ్ కారణంగా గత కొన్నేళ్లుగా దుర్వాసన, ఈగలు, దోమలు, వీధి కుక్కల బెడద ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు కాకుల బెడదతో ఇబ్బందులు పడిన గ్రామం..ఇప్పుడు ఈగల దాడితో సతమతమవుతోందని స్థానికులు వాపోతున్నారు.గ్రామస్తుల ఆరోపణల ప్రకారం పౌల్ట్రీ ఫామ్‌లో చనిపోయిన కోళ్లను సరైన పద్ధతిలో పారవేయకుండా బయట పడేస్తుండటంతో వాటిని తినేందుకు కుక్కలు గుంపులుగా చేరుతున్నాయి. కోళ్ల వ్యర్థాలు, అపరిశుభ్రత కారణంగా పరిసర ప్రాంతాల్లో ఈగల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని చెబుతున్నారు.ఈగలు ఇళ్లలోకి చేరి వంటగదులు, ఆహార పదార్థాలపై వాలుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నారులు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు పౌల్ట్రీ ఫామ్ పరిసరాల్లో సంచరించే వీధి కుక్కలు గ్రామంలోకి వచ్చి చిన్నారులపై దాడులు చేసి కరవడంతో పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో పిల్లలను ఒంటరిగా బయటకు పంపాలన్నా తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొందని అంటున్నారు.ఉదయం ఈగలు, కుక్కల బెడద.. రాత్రివేళ దోమల బాధతో ప్రశాంతంగా జీవించలేకపోతున్నామని వాపోతున్నారు.చివరకు గ్రామంలో శుభకార్యాలు నిర్వహించుకునే సమయంలో కూడా ఈగల బెడదతో ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ సమస్యపై ఇప్పటికే ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు సమస్యకు పరిష్కారం లభించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పౌల్ట్రీ ఫామ్ నిర్వహణలో పారిశుధ్య ప్రమాణాలు పాటిస్తున్నారా? చనిపోయిన కోళ్లను నిబంధనల ప్రకారం పారవేస్తున్నారా? వ్యర్థాల నిర్వహణ ఎలా జరుగుతోంది? అనే అంశాలపై సంబంధిత అధికారులు ఎందుకు తనిఖీలు నిర్వహించడం లేదని ప్రశ్నిస్తున్నారు.పౌల్ట్రీ ఫామ్ నిర్వహణ యాజమాన్యానికి మాత్రమే లాభదాయకంగా ఉండి, దాని పరిసరాల్లో నివసించే ప్రజలు మాత్రం దుర్వాసన, ఈగలు, దోమలు, కుక్కల బెడదను భరించాల్సిన పరిస్థితి ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే పరిస్థితులు ఉన్నాయనే ఆరోపణలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తేవాలని కోరుతున్నారు.ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్, ఎంపీడీవో, పశుసంవర్ధక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్పందించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. అరుణాదేవి పౌల్ట్రీ ఫామ్‌పై సమగ్ర విచారణ జరిపి, నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కోళ్ల వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో తొలగించేలా చర్యలు చేపట్టి, ఈగలు, దోమల నివారణకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నారు.అవసరమైతే జనావాసాలకు ఇబ్బందులు కలగకుండా పౌల్ట్రీ ఫామ్‌ను మరో ప్రాంతానికి తరలించే అంశాన్ని కూడా పరిశీలించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రజల ఆరోగ్యం కంటే పౌల్ట్రీ ఫామ్ నిర్వహణే ముఖ్యమా? చిన్నారుల భద్రతకు ముప్పు ఏర్పడుతున్నా అధికారులు ఇంకా ఎందుకు స్పందించడం లేదు? క్యాతంపెల్లి గ్రామస్తుల ఆవేదనపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా యంత్రాంగం ఎప్పుడు స్పందిస్తారు? పౌల్ట్రీ ఫామ్ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు లభిస్తుంది? అనేది ఇప్పుడు గ్రామస్తుల ముందున్న ప్రశ్న.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *