ఉత్సాహంగా జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు–2026-27
తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ మార్గదర్శకాలు,జిల్లా కలెక్టర్ అనుమతితో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలను భూపాలపల్లిలోని అంబేద్కర్ స్టేడియంలో ఉత్సాహంగా నిర్వహించారు.నాలుగవ తరగతి చదువుతున్న బాల బాలికల కోసం నిర్వహించిన ఈ ఎంపికల్లో జిల్లాలోని అన్ని మండలాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రీడా నైపుణ్యాలను అంచనా వేసేందుకు ఎత్తు, బరువు కొలతలతో పాటు 800 మీటర్ల పరుగు, 6×10 మీటర్ల షటిల్ రన్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, మెడిసిన్ బాల్ పుట్, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ వంటి మొత్తం తొమ్మిది విభాగాల్లో పోటీలు నిర్వహించారు.ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 10 మంది బాలురను,10 మంది బాలికలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి చిర్ర రఘు తెలిపారు. ఈ ఎంపికలు క్రీడా రంగంలో ప్రతిభ ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి ఉన్నత స్థాయి శిక్షణ అందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ ఎంపికలు విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు,భవిష్యత్తులో ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ముఖ్యమైన వేదికగా నిలిచాయి.మొత్తం మీద ఈ స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు జిల్లాలో క్రీడా వికాసానికి నూతన ఊపును అందించాయి.