రైతులకు శాస్త్రీయ పద్ధతులపై అవగాహన
భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గోపాలపురం గ్రామంలో సాగవుతున్న మిరప తోటలను మహబూబాద్ జిల్లా మల్యాల ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త హెడ్ డా. ఏ. అడ్లూరి ప్రశాంత్ కుమార్ పరిశీలించారు.జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి,మిరప కోత అనంతరం అనుసరించాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులపై విపులంగా అవగాహన కల్పించారు.మిరప పంటలో అధిక దిగుబడి,మెరుగైన నాణ్యత సాధించాలంటే పంట అవశేషాల సరైన నిర్వహణ,నేల ఆరోగ్య సంరక్షణ,సమతుల్య ఎరువుల వినియోగం,కీటకాలు వ్యాధుల నియంత్రణ చర్యలు కీలకమని వివరించారు.ఆధునిక సాగు పద్ధతులను అవలంబించడం ద్వారా రైతులు ఖర్చులను తగ్గించి లాభాలను పెంచుకోవచ్చని సూచించారు.అనంతరం జిల్లా ఉద్యానవన శాఖ కార్యాలయంలో కూరగాయల వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఇందులో మెరుగైన సాగు పద్ధతులు,పంటల ఎంపిక,నీటి నిర్వహణ,పంటల సంరక్షణ అంశాలపై సమగ్ర శిక్షణ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న పథకాలు ,మార్గదర్శకాలను కూడా వివరించారు.ఈ సందర్భంగా రైతులకు కూరగాయల మినీ విత్తనాల ప్యాకెట్లను పంపిణీ చేసి,తోటల విస్తరణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు.కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి ఏ. సునీల్ కుమార్, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస రెడ్డి,ఉద్యాన అధికారి మణి,ఉద్యాన విస్తరణ అధికారులు,సిబ్బంది రైతులు పాల్గొన్నారు.