ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
రైతులు,మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి రేగొండ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు, మత్స్యకారులు పాడి పశువుల పెంపకదారుల సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉందని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు (జీఎస్సార్) స్పష్టం చేశారు.రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా పశుసంవర్ధక, మత్స్య, నీటి పారుదల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పశువైద్య శిబిరం,రైతు వారోత్సవం,రైతు వారం కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాడి రైతులు తమ పశువుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని,ప్రభుత్వం అందిస్తున్న ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్సను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ముఖ్యంగా మేలు జాతి దూడల పెంపకం కోసం లింగ నిర్ధారిత వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేయించుకోవడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని రైతులకు వివరించారు.రైతు వారోత్సవాల ప్రాముఖ్యతను వివరిస్తూ.. చెరువుల్లో చేపల ఉత్పత్తిని పెంచేందుకు శాస్త్రీయ పద్ధతులు పాటించాలని, చేపలకు సోకే వ్యాధుల పట్ల మత్స్యకారులు అవగాహన కలిగి ఉండాలని కోరారు. చెరువుల్లో గుర్రపుడెక్క వంటి కలుపు మొక్కలను నివారించడం ద్వారా నీటి నాణ్యతను కాపాడుకోవచ్చని తెలిపారు. అనంతరం నీటి పారుదల శాఖ అధికారులతో మాట్లాడుతూ.. రైతు వారం కార్యక్రమంలో భాగంగా సాగునీటి కాలువల్లో పేరుకుపోయిన పూడికను, జమ్ము, కంపచెట్లను తక్షణమే తొలగించాలని ఆదేశించారు.ఎత్తిపోతల పథకాలకు అవసరమైన మరమ్మతులు పూర్తి చేయడంతో పాటు, నీటిపారుదల గేట్ల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.రైతులకు సాగునీరు అందడంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య,కొడవటంచ ఆలయ చైర్మన్ నాయినేని సంపత్ రావు,వివిధ శాఖల అధికారులు,ప్రజాప్రతినిధులు, రైతులు,మత్స్యకారులు,గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.