పాము కాటుకు గురైన మహిళాకి మరిపెడ పీహెచ్సి లో చికిత్స
పాము కాటుకు గురైన మహిళాకి మరిపెడ పీహెచ్సి లో చికిత్స
మరిపెడ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన చిర్ర రచన, భర్త చిర్ర అనిల్ (24) అనే యువతి శనివారం పాము కాటుకు గురయ్యారు. తన నివాస పరిసరాల్లో పని చేసుకుంటుండగా పాము కరిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన వారు ఆమెను మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
స్థానిక వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి బాధితురాలిని వెంటనే పరీక్షించి, అత్యవసరంగా యాంటీ స్నేక్ వీనమ్ ఇంజెక్షన్ ఇచ్చి ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని, మెరుగైన వైద్యం మరియు వైద్య పర్యవేక్షణ కోసం ఆమెను జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు ఆయన వెల్లడించారు.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: డాక్టర్ రవి
ఈ సందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ.. అకాల వర్షాల కారణంగా విషసర్పాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాము కాటుకు గురైన వెంటనే భయపడకుండా, నాటు వైద్యం వైపు వెళ్లకుండా నేరుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి సకాలంలో వైద్య సహాయం పొందాలని ఆయన కోరారు.