ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి:అధికారులకు సీఎస్ రామకృష్ణారావు ఆదేశం
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి:అధికారులకు సీఎస్ రామకృష్ణారావు ఆదేశం
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరాలు, విద్యా, డిఆర్డీఓ అధికారులతో ధాన్యం కొనుగోలు, ఫార్మర్ రిజిస్ట్రీ, సెన్సస్, విద్యా వారోత్సవాలపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. జిల్లాల్లో ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని, సెన్సస్ (జనగణన)లో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ గడువు ముగుస్తున్నందున ప్రభుత్వ ఉద్యోగులందరూ స్వీయ గణన చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈ నెల 11 నుంచి ప్రారంభమయ్యే విద్యా వారోత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.అనంతరం భూపాలపల్లి ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ,సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.విద్యా వారోత్సవాలను జిల్లాలో షెడ్యూల్ ప్రకారం పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని అధికారులను కోరారు.సెన్సస్ ప్రక్రియపై సూపర్ వైజర్లు,ఎన్యూమరేటర్లకు తక్షణమే శిక్షణా సమావేశాలు నిర్వహించి వారిని క్షేత్రస్థాయి పనికి సన్నద్ధం చేయాలని సూచించారు.ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కిరణ్ కుమార్,సివిల్ సప్లైస్ డీఎం రాములు,జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) రాజేందర్,డీఆర్డీఓ అధికారులు తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా పనిచేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు