మోదీ కార్యక్రమంలో బండి సంజయ్ పేరు గైర్హాజరు: యాదాద్రి జిల్లాలో రేపే ‘మల్కాపూర్ టర్మినల్’ ప్రారంభోత్సవం

ఈ69న్యూస్ చౌటుప్పల్ (యాదాద్రి భువనగిరి జిల్లా)
దేశాభివృద్ధిలో భాగంగా తెలంగాణలో మరో కీలక ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. చౌటుప్పల్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) నిర్మించిన ‘మల్కాపూర్ టర్మినల్ ప్రాజెక్టు’ను ఈ నెల 10వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేయనున్నారు.
కేంద్ర మంత్రుల జాబితాలో ఇద్దరికే చోటు:
ఈ కార్యక్రమానికి సంబంధించి కేంద్ర పెట్రోలియం శాఖ విడుదల చేసిన అధికారిక ఆహ్వాన పత్రిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రుల కోటాలో కేవలం ఇద్దరు మంత్రుల పేర్లు మాత్రమే ఆహ్వాన పత్రికలో చోటు సంపాదించుకున్నాయి. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి పేర్లు మాత్రమే ప్రోటోకాల్ జాబితాలో ఉన్నాయి.
బండి సంజయ్ పేరు లేకపోవడంపై చర్చ:
తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పేరు ఈ అధికారిక ఆహ్వాన పత్రికలో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. రాష్ట్రంలో జరుగుతున్న ఇంత పెద్ద అభివృద్ధి కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటున్నప్పటికీ, బండి సంజయ్ పేరు లేకపోవడం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
హాజరుకానున్న ముఖ్య నేతలు:
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలతో పాటు కేంద్ర సహాయ మంత్రి సురేష్ గోపి, స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొననున్నారు.
మల్కాపూర్ టర్మినల్ వద్ద ఏర్పాటు చేసిన లైవ్ టెలికాస్ట్ ద్వారా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.