జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
అక్రమ విక్రయాలు జరిపితే డీలర్ల లైసెన్సులు రద్దు
ఫార్మర్ రిజిస్ట్రీలో వెనుకబడొద్దు-వ్యవసాయ అధికారులకు ఆదేశం
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి
జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలను కట్టడి చేయడానికి కఠిన చర్యలు తీసుకోవాలని,అక్రమాలకు పాల్పడే వారిపై పోలీస్ కేసులు నమోదు చేయడంతో పాటు లైసెన్సులు రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నకిలీ విత్తనాల నియంత్రణ,ఫార్మర్ రిజిస్ట్రీ,పచ్చి రొట్ట ఎరువుల వినియోగం, నానో యూరియాపై అవగాహన అంశాలపై వ్యవసాయ,పోలీస్ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వానాకాలం సాగు సమయానికి రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.నకిలీ విత్తనాలను అరికట్టేందుకు మండల స్థాయిలో రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖలతో, జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ బృందాలతో నిరంతర నిఘా ఉంచాలన్నారు.విత్తనాల అక్రమ నిల్వలు, రవాణాపై రాజీ లేని పోరాటం చేయాలని సూచించారు.రైతులకు మేలు చేసే పచ్చి రొట్ట ఎరువుల సాగు, నానో యూరియా వాడకంపై క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని కోరారు.జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ ఇప్పటి వరకు 67 శాతంపూర్తయిందని, దీనిని వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.కొత్తపల్లి గోరి క్లస్టర్లో అత్యధికంగా 82 శాతం నమోదు పూర్తి చేసిన ఏఓ సారయ్యను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.ప్రతిరోజూ పురోగతి నివేదికలను సమర్పించాలని, రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే ఈ రిజిస్ట్రీ కీలకమని పేర్కొన్నారు.ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి బాబూరావు, ఏఎస్పీ నరేష్ కుమార్, ఏడీఏ శ్రీపాల్, అన్ని మండలాల వ్యవసాయ అధికారులు, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు.