తహసిల్దార్ అధికారులపై ప్రజావాణిలో ఆర్ఎస్పీ ఫిర్యాదు
వరంగల్ రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పర్వతగిరి తహసిల్దార్ అధికారుల నిర్లక్ష్యంపై రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి వల్లందాస్ కుమార్ ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామంలో 2006-2007 సంవత్సరంలో ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం సర్వే నెం. 432లో 3 ఎకరాల 3 గుంటల [3-03] భూమిని కొనుగోలు చేసి ప్రభుత్వం పేరున రిజిస్ట్రేషన్ చేయించిందని తెలిపారు.వడ్లకొండ గ్రామానికి చెందిన మమ్మద్ అబ్దుల్ ఘఫూర్ మియా కొందరు దళారులతో కుమ్మక్కై పేదల కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన ఆ భూమిని అక్రమంగా ఆక్రమించి, ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని ఆరోపించారు.ఈ విషయంపై స్థానిక పర్వతగిరి తహసిల్దార్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, రెవెన్యూ అధికారులు భూ అక్రమదారునితో కుమ్మక్కై ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని వల్లందాస్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే మమ్మద్ అబ్దుల్ ఘఫూర్ మియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్థానిక తహసిల్దార్ అధికారులపై చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా వడ్లకొండ గ్రామంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమిని మండల సర్వేయర్‌తో సర్వే చేయించి, ప్రభుత్వ భూమికి హద్దులు నిర్ణయించి,ఆ భూమిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందని గుర్తు చేశారు.
వరంగల్ ఆర్డీవోకు ప్రజావాణిలో వినతిపత్రం అందజేసినట్లు ఆర్ఎస్పీ జిల్లా కార్యదర్శి వల్లందాస్ కుమార్ తెలిపారు.