తిరుమలలో భక్తుల దుస్థితిపై డాక్టర్ సీపాన గుణవతి ఆవేదన
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అఖిల భారత బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర మహిళా కన్వీనర్, సంఘసేవకురాలు డాక్టర్ సీపాన గుణవతి ఆందోళన వ్యక్తం చేశారు.ఇటీవల సాధారణ భక్తురాలిగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన సందర్భంగా భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు ఆమె తెలిపారు. దర్శనం కోసం గంటల తరబడి క్యూ కాంప్లెక్స్‌లలో వేచి ఉండాల్సి రావడం వల్ల మహిళలు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.మండుతున్న ఎండల్లో సుమారు 18 గంటలపాటు టికెట్ కోసం వేచి ఉండి, అనంతరం మరో నాలుగు గంటలపాటు రీ-ఎంట్రీ ద్వారా దర్శనం చేసుకోవాల్సి రావడం వల్ల భక్తులు మొత్తం 22 గంటలకు పైగా క్యూలైన్లలో గడపాల్సిన పరిస్థితి నెలకొనడం అమానుషమని ఆమె విమర్శించారు. 42 డిగ్రీల వరకు నమోదవుతున్న ఉష్ణోగ్రతల మధ్య చిన్నారులకు పాలు, వృద్ధులకు అవసరమైన సౌకర్యాలు, సాధారణ భక్తులకు తాగునీరు వంటి కనీస అవసరాలను కూడా సమర్థవంతంగా అందించడంలో ఆలయ యంత్రాంగం విఫలమైందని ఆరోపించారు.
కిలోమీటర్ల మేర విస్తరించిన క్యూ లైన్లలో భక్తులను క్రమబద్ధంగా నిర్వహించేందుకు తగిన సిబ్బంది, వాలంటీర్లు లేకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చిందన్నారు. భక్తుల వద్ద నుంచి మొబైల్ ఫోన్లు తీసుకుని, అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ నంబర్లకు ఫోన్ చేయాలని సూచిస్తూ బోర్డులు ఏర్పాటు చేయడం విచిత్రంగా ఉందని వ్యాఖ్యానించారు. మొబైల్ ఫోన్లు లేని పరిస్థితిలో భక్తులు అత్యవసర సేవలను ఎలా వినియోగించగలరని ప్రశ్నించారు.క్యూలైన్లలో ఏర్పాటు చేసిన అత్యవసర ద్వారాల వద్ద కూడా తగిన సిబ్బంది లేకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆమె అన్నారు. రద్దీ కారణంగా భక్తులు ఒకరినొకరు తోసుకుంటూ తొక్కిసలాటలకు గురవుతున్నా పరిస్థితిని అదుపులో పెట్టేందుకు సమర్థవంతమైన చర్యలు కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.“భక్తులకు అన్నప్రసాదం అందించడం మాత్రమే కాకుండా, వారి ప్రాణ భద్రత, గౌరవం, కనీస సౌకర్యాలు కల్పించడం కూడా అత్యంత ముఖ్యమైన బాధ్యత.భక్తులు సురక్షితంగా ఉన్నారా లేదా అన్నదానిపై ప్రభుత్వం, టీటీడీ పాలకమండలి ప్రత్యేక దృష్టి సారించాలి” అని డాక్టర్ గుణవతి స్పష్టం చేశారు.తిరుమల వంటి అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక కేంద్రంలో భక్తులు అవమానకర పరిస్థితులను ఎదుర్కోవడం మానవ హక్కులు, బాలల హక్కుల ఉల్లంఘనతో సమానమని ఆమె పేర్కొన్నారు. భక్తుల సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకుని ఆలయ పరిపాలనలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.ప్రస్తుత పాలకమండలి పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సమీక్ష నిర్వహించాలని, భక్తుల భద్రత, సంక్షేమం, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా కొత్త విధానాలు అమలు చేయాలని ఆమె కోరారు.అలాగే తిరుమలలో భక్తుల భద్రత, సౌకర్యాల అంశాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.“నేను స్వయంగా సాధారణ భక్తురాలిగా గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి భక్తుల బాధలను చూశాను. భక్తులు హరినామ స్మరణ కంటే తమ కష్టాలను వ్యక్తం చేసుకునే పరిస్థితి నెలకొనడం అత్యంత విచారకరం. ఈ పరిస్థితి వెంటనే మారాలి” అని డాక్టర్ గుణవతి భావోద్వేగంతో పేర్కొన్నారు.తిరుమల కేవలం ఒక ఆలయం మాత్రమే కాదని, కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక అని ఆమె తెలిపారు. అలాంటి పవిత్ర క్షేత్రానికి వచ్చే ప్రతి భక్తుడి ప్రాణ భద్రత, గౌరవం, సౌకర్యాలు కాపాడటం ప్రభుత్వం, టీటీడీ యంత్రాంగం మరియు ఆలయ నిర్వాహకుల అత్యున్నత బాధ్యత అని స్పష్టం చేశారు.కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా తిరుమల ఆలయ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసి పాలకమండలి, అధికారుల పనితీరును సమీక్షించి భక్తుల సంక్షేమానికి ప్రాధాన్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని డాక్టర్ సీపాన గుణవతి డిమాండ్ చేశారు.