యోగమే ఆరోగ్యానికి మార్గమని చాటిన డాక్టర్ భవాని
ఖమ్మంజిల్లా సత్తుపల్లికి చెందిన ప్రముఖ యోగా శిక్షకురాలు డాక్టర్ భవాని అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కొండాపూర్‌లోని బొటానికల్ గార్డెన్లో నిర్వహించిన 108 సూర్య నమస్కారాల ఛాలెంజ్‌లో విశిష్ట ప్రతిభ కనబరిచి ప్రతిభా సర్టిఫికెట్తో పాటు అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రాణ యోగా & సౌండ్ థెరపీ సెంటర్ ఆధ్వర్యంలో, భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారంతో ఘనంగా నిర్వహించారు.
డాక్టర్ భవాని ప్రస్తుతం అంతర్జాతీయ యోగా ఇన్స్పెక్టర్గా వైద్యురాలుగా సేవలందిస్తున్నారు. అలాగే బెంగళూరులోని డీమ్డ్ యూనివర్సిటీలో యోగా థెరపీలో పట్టా పొందారు. సత్తుపల్లి విశ్వశాంతి విద్యాలయంలో చదువుకున్న రోజుల్లో మెడిటేషన్ మరియు యోగ శాస్త్రీయ సాంప్రదాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నామని అదే సిద్ధాంతాన్ని ప్రయాణ పట్ల నడుచుకుంటూ.. చిన్ననాటి నుంచే యోగా పట్ల ఆసక్తి పెంచుకుని వివిధ రాష్ట్ర, జాతీయ స్థాయి యోగా కార్యక్రమాల్లో పాల్గొంటూ విశేష ప్రతిభ కనబరుస్తున్నారు. గత సంవత్సరం గంగారంలోని 15వ బెటాలియన్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో కూడా పాల్గొన్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ భవాని మాట్లాడుతూ, యోగా అనేది కేవలం ఒకరోజు చేసే కార్యక్రమం కాదని, ప్రతిరోజూ ఉదయం క్రమం తప్పకుండా యోగాసనాలు చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లల్లో యోగా పట్ల ఆసక్తిని పెంపొందిస్తే మంచి ఆరోగ్యం, ఏకాగ్రత, వ్యక్తిత్వ వికాసం, విద్యలో ఉన్నత ఫలితాలు సాధించడంతో పాటు ఒత్తిడిని అధిగమించే సామర్థ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. యోగా సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన సంతోషకరమైన జీవితానికి మార్గదర్శకమని వివరించారు.
ప్రాణ యోగా & సౌండ్ థెరపీ సెంటర్ నిర్వాహకులు, సహ వ్యవస్థాపకులు మాస్టర్ యోగానంద్ ఉమా బస్టోలా మాట్లాడుతూ, 108 సూర్య నమస్కారాల ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్ భవాని అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదల యోగా స్ఫూర్తికి నిదర్శనమని కొనియాడారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆమెకు ప్రతిభా సర్టిఫికెట్, అవార్డును ప్రదానం చేయడం తమకు ఆనందంగా ఉందని తెలిపారు.
డాక్టర్ భవాని సాధించిన ఈ విజయం యోగా రంగంలో ఆమె నిబద్ధతకు గుర్తింపుగా నిలుస్తుందని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులు ఆమెను అభినందించారు. యోగా ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో ఆరోగ్యం, జీవశక్తి, మానసిక ప్రశాంతత నెలకొనాలని వారు ఆకాంక్షించారు.
Good coverage medam garu.