తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిన విద్యార్థులు
స్టేషన్ ఘన్పూర్ అక్టోబర్ 9 (తెలుగు గళం):
స్టేషన్ ఘన్పూర్లోని ఫాదర్ కొలంబో పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను పేర్చి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, వాటికి అనుగుణంగా నృత్యాలు చేయడంతో పాఠశాల ప్రాంగణమంతా పండుగ శోభను సంతరించుకుంది. విద్యార్థుల సందడి, పూల సోయగాల మధ్య వేడుకలు ఆనందోత్సాహాలతో సాగాయి.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేయడంతో పాటు ప్రకృతి పట్ల ప్రేమ, ఐక్యత, సోదరభావం, సమష్టి భాగస్వామ్యం వంటి విలువలను పెంపొందించారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల్లో సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంచడంతో పాటు వారి సృజనాత్మకతను వెలికితీసేందుకు దోహదపడతాయని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.ఈ వేడుకల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఫాదర్ థామస్ కిరణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
