ఫోన్‌పే నకిలీ సందేశాలతో రూ.1.05 లక్షల మోసం!
బిర్యానీ కేంద్రాల నిర్వాహకుడిపై ఫిర్యాదు
ఈ69న్యూస్ వరంగల్, అక్టోబర్ 14

ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపించినట్లు నకిలీ సందేశాలు చూపించి ఆపిల్ వ్యాపారిని మోసం చేసిన ఘటన వరంగల్‌లో వెలుగుచూసింది.సుమారు 20 రోజుల వ్యవధిలో రూ.1,05,000 విలువైన ఆపిల్స్ తీసుకొని నగదు చెల్లించకుండా మోసానికి పాల్పడినట్లు బాధిత వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.వివరాల్లోకి వెళితే..వరంగల్‌లోని వాల్‌మార్ట్ ఎదురుగా, అండర్ బ్రిడ్జి సమీపంలో బిర్యానీ కేంద్రాలు నిర్వహిస్తున్న జక్రియ అనే వ్యక్తి గత 20 రోజులుగా తన కేంద్రాల వద్ద పండ్ల వ్యాపారాన్ని కూడా ప్రారంభించాడు. ఈ క్రమంలో వరంగల్ పండ్ల మార్కెట్‌కు వచ్చి వ్యాపారి ఎం.డి. అఫ్జల్ వద్ద నుంచి సుమారు రూ.1.05 లక్షల విలువైన ఆపిల్స్ కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఆపిల్స్ తీసుకున్న ప్రతిసారీ ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపించినట్లు నకిలీ సందేశాలను చూపిస్తూ జక్రియ మోసానికి పాల్పడినట్లు బాధితుడు ఆరోపించారు.అనుమానం రావడంతో బ్యాంకు ఖాతా లావాదేవీల వివరాలను పరిశీలించగా, తన ఖాతాలోకి ఎలాంటి నగదు జమ కాలేదని గుర్తించినట్లు తెలిపారు.దీంతో బాధిత వ్యాపారి బుధవారం (అక్టోబర్ 14) పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి.