అవగాహన సదస్సు స్వచ్ఛ గ్రామంవైపు అడుగు
ఆత్మకూరు మండలం హౌజ్ బుజుర్గు గ్రామ ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ గ్రామం సాధ్యమవుతుందని హౌజ్ బుజుర్గు గ్రామ సర్పంచ్ సయ్యద్ మౌల అన్నారు. హౌజ్ బుజుర్గు గ్రామంలో బుధవారం గ్రామ సర్పంచ్ సయ్యద్ మౌల, పంచాయతీ కార్యదర్శి అమిత రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు తడి చెత్త, పొడి చెత్త వర్గీకరణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సయ్యద్ మౌల మాట్లాడుతూ… మన గ్రామాన్ని మనమే శుభ్రపరుచుకోవాలని, హౌజ్ బుజుర్గును ఆదర్శ పారిశుధ్య గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇందుకు గ్రామ ప్రజలందరి సహాయ సహకారాలు ఎంతో అవసరమని ఆయన కోరారు. ఇళ్లలోనే తడి, పొడి చెత్తను వేరు చేసి పంచాయతీ సిబ్బందికి అందించాలని కార్యదర్శి అమిత రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవగాహన కార్యక్రమం అనంతరం, తీవ్రమైన ఎండలను దృష్టిలో ఉంచుకుని ఉపాధి హామీ పనులు చేస్తున్న మహిళా కూలీలకు సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డుసభ్యుల చేతుల మీదుగా ఉచితంగా మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఎండ తీవ్రతకు అల్లాడుతున్న తమకు మజ్జిగ పంపిణీ చేయడంపై ఉపాధి కూలీలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బోడిగే లక్ష్మి రాంబాబు, వార్డు సభ్యులు నేరెళ్ల రాజు, పెండేల కరుణాకర్, కరీంబి బషీర్, గిరిబి హుస్సేన్, కమల్, సలీంపాషా, యుగేందర్, ఫీల్డ్ అసిస్టెంట్ ఒన్నాల చిన్ని, గ్రామ పెద్దలు మరియు మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.