చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు–ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ హెచ్చరిక

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు – ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ హెచ్చరిక
ఈ69న్యూస్ వరంగల్ మే15
వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మామూనూర్ డివిజనల్ పోలీసుల ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని రౌడీ షీటర్లకు శుక్రవారం మామూనూర్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీ షీటర్లు మరియు నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు చట్టబద్ధంగా, సమాజానికి హాని కలగకుండా ప్రవర్తించాలని స్పష్టం చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, గొడవలు, బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.మద్యం, జూదం, అక్రమ వసూళ్లు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనరాదని, పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.అనుమానాస్పద కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.తమ పరిసరాల్లో ఏదైనా నేర సంఘటన జరిగితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని డీసీపీ పేర్కొన్నారు.అలాగే చిరునామా, ఫోన్ నంబర్ లేదా ఇతర వ్యక్తిగత వివరాల్లో మార్పులు వచ్చినప్పుడు వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.రౌడీ షీటర్లు తమ ప్రవర్తన మార్చుకుని చట్టానికి లోబడి జీవిస్తే సమాజంలో గౌరవప్రదమైన స్థానం సంపాదించుకోవచ్చని, లేకపోతే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మామూనూర్ ఏసీపీ వెంకటేష్, మామూనూర్, గీసుగొండ, ఏనుమాముల ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ యాదవ్, విశ్వేశ్వర్, సురేష్, సంగెం ఎస్ఐ వంశీ కృష్ణ పాల్గొన్నారు.