పౌర సరఫరాల శాఖ తక్షణమే స్పందించాలి
- పౌర సరఫరాల శాఖ తక్షణమే స్పందించాలి
తెలుగు గళం న్యూస్, పర్వతగిరి / ఏప్రిల్ 27
వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని పెట్రోల్ బంకుల్లో గత రెండు రోజులుగా పెట్రోల్ కొరత తీవ్రంగా ఏర్పడింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పలు బంకుల వద్ద ‘పెట్రోల్ లేదు’ బోర్డులు కనిపిస్తుండగా, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు నిరాశతో వెనుదిరుగుతున్నారు.అత్యవసర పనులు, ఆసుపత్రి అవసరాల కోసం వెళ్లాల్సిన ప్రజలు పక్క మండలాలకు వెళ్లి ఇంధనం తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.ఈ కొరత కారణంగా ఆటో, బైక్ డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టాక్ లేదని బంకు యజమానులు చెబుతున్నప్పటికీ, సరఫరాలో జాప్యం ఎందుకు జరుగుతుందో స్పష్టత లేకపోవడం ప్రజల్లో అనుమానాలకు దారి తీస్తోంది.వెంటనే పెట్రోల్ సరఫరా పునరుద్ధరించాలి. స్టాక్ కొరతకు గల కారణాలను అధికారులు వెల్లడించాలి. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి, న్యాయ ధరలకు అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. పౌర సరఫరాల శాఖ, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని మండల ప్రజలు కోరుతున్నారు.